సాక్షి : భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రసంగంపై దాయాది దేశం పాకిస్థాన్ విరుచుకుపడింది. భారత్ ఉగ్రవాదానికి అమ్మ వంటిదని.. దక్షిణాసియా దేశాల్లో టెర్రరిజానికి అసలైన చిరునామా ఇండియాదేనని పాక్ పేర్కొంది. సుష్మా ప్రసంగించి 24 గంటలు గడకముందే ఐరాస వేదికగానే పాక్ ఈ వ్యాఖ్యలు చేయటం గమనార్హం.
‘‘పాక్‌పై ఇండియా వైఖరి ఏంటో సుష్మా ప్రసంగం ద్వారా స్పష్టమైంది. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించటం లేదు ఇండియాలోనే పుడుతోంది’’ అని ఐరాస సాధారణ సభలో పాక్ తరపు రాయబారి మలీహా లోధి ఆరోపించారు. ఈ సందర్బంగా కశ్మీర్ అంశాన్ని ఆమె లేవనెత్తారు. కీలకమైన కశ్మీర్ అంశాన్ని పక్కదోవ పట్టించేందుకు సుష్మా ఇలాంటి ఆరోపణలు చేశారని లోధి తెలిపారు. ‘‘కశ్మీరీల హక్కులను కాలరాస్తూ భారత ప్రభుత్వం అక్కడి ప్రజలపై ఉక్కుపాదం మోపుతోంది. పిల్లలు, వృద్ధులు అని కూడా చూడకుండా పెల్లెట్లు ప్రయోగిస్తోంది. వాస్తవాలను మరుగున పరిచేందుకు ఆమె (సుష్మా) ప్రయత్నిస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుకు సంబంధించిన అంశం చర్చల ద్వారా విఫలమైతే అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది’’ అని లోధా చెప్పుకొచ్చారు.
కాబట్టి కశ్మీర్ వ్యవహారంలో ఐరాస, అగ్ర రాజ్యాలు జోక్యం చేసుకోవాల్సిందేనని ఆమె కోరారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించటం వాళ్ల(ఐరాస) బాధ్యత మాత్రమే కాదు హక్కు కూడా అని లోధీ చెప్పారు. అదే సమయంలో పాక్ ప్రధాని షాహిద్ ఖాఖన్ అబ్బాసీ కశ్మీర్ అంశం కోసం ఓ ప్రత్యేక దూతను నియామించాలని విజ్ఞప్తి చేసిన విషయాన్ని లోధీ ప్రస్తావించారు.