'భార్యలను కొట్టొచ్చు.. కొంచెం మెల్లగా'
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని ప్రభుత్వ గుర్తింపు పొందిన ఓ మతపరమైన సంస్థ.. మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో పొందుపరచిన పలు అంశాలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి.
ద కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ(సీఐఐ) అనే సంస్థ ఇటీవల పాక్లోని పంజాబ్ ప్రభుత్వం మహిళల రక్షణకు చేసిన పీపీడబ్ల్యూఏ చట్టం సరిగా లేదని దానిస్థానంలో కొత్త చట్టం తీసుకురావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఆ కొత్త చట్టంలో ఉండాల్సిన అంశాలపై ఓ నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. అందులో మహిళలను అవసరమైతే భర్తలు కొట్టొచ్చు.. కాకపోతే కొంచెం మెల్లగా కొట్టాలంటూ సూచించింది. అంతే కాదు ఏ ఏ సందర్భాల్లో కొట్టొచ్చో సవివరంగా నివేదికలో పేర్కొంది సీఐఐ.
దీనిలోని కొన్ని అంశాలను పరిశీలిస్తే.. భర్త చెప్పిన మాటను లెక్కచేయకుండా భార్య ప్రవర్తించినప్పుడు, భర్త చెప్పిన విధంగానే డ్రెస్ చేసుకోనప్పుడు, బురఖా ధరించనప్పుడు, అపరిచితులతో మాట్లాడినప్పుడు ఇలా పలు సందర్భాల్లో భార్యను మెల్లగా కొట్టొచ్చు అంటూ ఆ నివేదికలో పేర్కోంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ తరువాత కో ఎడ్యుకేషన్ ఉండరాదని, నర్సులు పురుష పేషంట్లకు చికిత్స చేయొద్దని ఇలా పలు అంశాలతో కూడిన నివేదిక త్వరలోనే పంజాబ్ అంసెంబ్లీలో చర్చకు రానుంది.