పాక్‌ దుశ్చర్య : ఉ‍గ్ర జాబితాలో ఆ పేర్లు మాయం | Pakistan Removes Thousands Of Terrorists From Terror Watch List | Sakshi
Sakshi News home page

ఉ‍గ్ర జాబితాలో ఆ పేర్లు మాయం

Published Tue, Apr 21 2020 3:26 PM | Last Updated on Tue, Apr 21 2020 3:26 PM

Pakistan Removes Thousands Of Terrorists From Terror Watch List - Sakshi

న్యూయార్క్‌ : 2008 ముంబై దాడి ఘటనకు ప్రధాన సూత్రధారి, లష్కరే కమాండర్‌ జకీవుర్‌ రెహ్మాన్‌ లఖ్వీ సహా 1800 మంది ఉగ్రవాదుల పేర్లను పాకిస్తాన్‌ తన నిఘా జాబితా నుంచి తొలగించింది. అంతర్జాతీయ మనీల్యాండరింగ్‌ వ్యవహారాల గుట్టుమట్లను తేల్చే ఫైనాన్షియల్‌  యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) తదుపరి మదింపునకు ముందు పాక్‌ ఈ చర్యకు పాల్పడిందని వెల్లడైంది. పాకిస్తాన్‌ నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం అథారిటీ (నాక్టా) నిర్వహించే ఈ నిషేధిత జాబితా ఉగ్రవాద అనుమానితులతో వ్యాపార లావాదేవీలు చేయకుండా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలను నిలువరిస్తుంది.

2018లో ఉగ్ర జాబితాలో 7600 పేర్లుండగా, గత 18 నెలల్లో ఈ సంఖ్య 3800కు తగ్గిందని అమెరికాకు చెందిన రెగ్యులేటరీ టెక్నాలజీ కంపెనీ కాసిలమ్‌ ఏఐ నిగ్గుతేల్చింది. మార్చి నుంచి 1800 పేర్లను ఈ జాబితా నుంచి తొలగించారని సదరు కంపెనీ తెలిపింది. ఉగ్ర సంస్ధలు, వ్యక్తులపై ఆర్థిక నియంత్రణలు, ఆంక్షల అమలు కోసం పారిస్‌కు చెందిన ఎఫ్‌ఏటీఎఫ్‌తో పాకిస్తాన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఉగ్రవాద ఫైనాన్సింగ్ నివారణ చర్యలు మరియు ఆర్థిక ఆంక్షలకు సంబంధించి పాకిస్తాన్ చర్యలపై ఎఫ్‌ఏటీఎఫ్‌ పెదవివిరుస్తోంది.  పాకిస్తాన్ 27 అంశాలపై చర్య చేపట్టాల్సి ఉండగా 14 అంశాలనే పరిష్కరించిందని ఫిబ్రవరిలో ఎఫ్‌ఏటీఎఫ్‌ గుర్తించింది. మిగిలిన చర్యలపై వివిధ స్థాయిలలో పురోగతి సాధించిందని ఎఫ్‌ఏటీఎఫ్‌ గమనించింది.

చదవండి : పాక్‌లో సామూహిక ప్రార్థనలకు అనుమతి

ఇక ఈ ఏడాది జూన్‌లో పాకిస్తాన్ పురోగతిని ఎఫ్‌ఏటీఎఫ్‌ మళ్లీ అంచనా వేస్తుంది.  మనీలాండరింగ్‌ ,టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ నిరోధక నిబంధనలకు అనుగుణంగా లేదని భావించే దేశాల జాబితాలో ఎఫ్‌ఏటీఎఫ్‌ తమను చేర్చబడకుండా ఉండేందుకు పాకిస్తాన్ కసరత్తు చేస్తుండగా ఇది ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని అధికారులు భయపడుతున్నారు. మరోవైపు పాకిస్తాన్ జాబితా నుండి తొలగించబడిన పలు ఉగ్రవాదుల  పేర్లు అమెరికా, ఐక్యరాజ్యసమితి ఆంక్షల జాబితాలో పొందుపరిచిన ఉగ్రవాదులకు మారుపేర్లుగా కనిపిస్తున్నాయని కాసిలమ్‌ ఏఐ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement