కొనసాగుతున్న పాకిస్తాన్ కుయుక్తులు
ఇస్లామాబాద్: భారత గూఢచారి డ్రోన్ (స్పై డ్రోన్) ను తమ సైన్యం కూల్చివేసిందని ప్రకటించిన పాకిస్థాన్ ఇపుడు మరో ఎత్తుగడ వేసింది. దీనికి సంబంధించి పాక్లోని భారత రాయబారికి గురువారం సమన్లు పంపింది. ఇండియన్ హై కమిషనర్ రాఘవన్కు సమన్లు జారీ చేశామని విదేశీ వ్యవహారాల శాఖ అధికారి తెలిపారు. స్పై డ్రోన్ చొరబాటుకు నిరసనగానే తామీ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాల్సిందేనన్న డిమాండ్తో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చల ప్రక్రియపై నీలి మేఘాలు కమ్ముకున్న తరుణంలో భారత సైన్యానికి చెందిన డ్రోన్ను పాక్ ఆర్మీ కూల్చివేసిందన్న వార్తలు కలకలం రేపాయి.
ఇప్పటికే పలుమార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలోతొక్కిన పాక్ ఆక్రమిత కశ్మీర్ సరిహద్దులో కాల్పులకు పాడుతూ భారత్ను కవ్వించే ప్రయత్నం చేస్తోంది. నిబంధనలను అతిక్రమించి మా గగనతలంలోకి ప్రవేశించినందువల్లే డ్రోన్‌ను కూల్చేసామని పాక్ సమర్థించుకుంది. మరోవైపు 'ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం ఖండించింది. తమకు సంబంధించిన డ్రోన్ ఏదీ కూలిపోలేదని ప్రకటించింది.