
'వారికి అమెరికాలో అడుగు ఇక చాలాకష్టం'
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాను చెప్పినవి ఒట్టి మాటలుకావని నిరూపించబోతున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికా దేశమంతటా పరదేశీయులే నిండారంటూ పలికిన ఆయన ఇక తమ దేశంలోకి వేరే దేశీయులను రానిచ్చే విషయంలో ఆచితూచి వ్యవహరించబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.
ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి అమెరికాకు వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండబోతున్నారు. మొత్తం ఏడు దేశాలకు చెందిన ముస్లింలను అమెరికాలోకి అడుగుపెట్టకుండా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే, పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, సౌదీ అరేబియా దేశాలు మాత్రం ఆయన నిషేధించిన దేశాల జాబితాలో లేవు. దీనిపై ట్రంప్ ను ప్రశ్నించగా..
'ఈ దేశాలకు చెందినవారికి అమెరికా వచ్చే సమయంలో ప్రత్యేక తనిఖీలు ఉంటాయి. చిన్న అవకాశం కూడా ఇవ్వబోం. అలా చేస్తే ప్రమాదం జరిగే అవకాశం లేకపోలేదు' అని ఆయన చెప్పారు. మొత్తం ముస్లింలందరినీ బ్యాన్ చేయడం ఉద్దేశం కాదని, టెర్రరిజం ప్రభావం ఉండే దేశాలకు చెందిన వారి విషయంలో ఇలాంటివి ఉంటాయని చెప్పారు. 'ఇప్పటి వరకు తేలికగా అమెరికాలో అడుగుపెట్టారు. ఇక నుంచి వారు అమెరికాలో అడుగుపెట్టాలంటే చాలా చాలా కష్టం' అని ట్రంప్ స్పష్టం చేశారు.