
అమెరికాకే కన్నం వేయబోయిన పాక్ వ్యాపారి!
ఆ దేశం వాళ్లకు మహా అయితే సైకిళ్లు, సూదులు చేయడం తప్ప మరేమీ రాదని అంతా అనుకుంటారు. కానీ, కొన్నాళ్లకు ఏకంగా అణుబాంబులు, ఖండాంతర క్షిపణులు కూడా తయారుచేసి చూపించింది. అంత పరిజ్ఞానం ఎలా వచ్చిందా అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ, ఆ దేశ అణు పితామహుడు ఏక్యూ ఖాన్ అసలు విషయం చెప్పేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని చోరీ చేయడం, కావల్సిన సామగ్రిని స్మగ్లింగ్ చేయడం ద్వారానే తాము అణుబాబులు చేశామన్నారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్ తీరు మాత్రం మారలేదు. ఇప్పుడు తాజాగా ఆ దేశం డ్రోన్లు తయారుచేయాలని అనుకుంటోంది. కానీ, ఎలా చేయాలో తెలియదు. అందుకే అమెరికా నుంచి ఆ పరిజ్ఞానాన్ని చోరీ చేయడానికి ఓ పాక్ వ్యాపారవేత్త ప్రయత్నించాడు. అక్రమంగా గైరోస్కోపులు సేకరించడానికి ప్రయత్నిస్తున్న అతడిని పోలీసులు పట్టుకున్నారు. అతడికి అమెరికా కోర్టు 33 నెలల జైలు శిక్ష కూడా విధించింది. సయ్యద్ వఖార్ అష్రఫ్ అనే వ్యక్తి లాహోర్‌లో ఐ అండ్ ఈ ఇంటర్నేషనల్ అనే సంస్థకు సీఈవో. ఇన్నోవేటివ్ లింక్స్ అనే బూటకపు కంపెనీ పేరుతో గైరోస్కోపులు తీసుకోడానికి అతడు ప్రయత్నించాడు. అందుకోసం వఖార్ ఎ జాఫ్రీ అనే దొంగపేరుతో గైరోస్కోపుల ధరలకు కొటేషన్ ఇవ్వాలని టస్కన్‌కు చెందిన ఓ కంపెనీని అడిగాడు. అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం నియంత్రణలు ఉన్నాయని, అమ్మాలన్నా కొనాలన్నా లైసెన్సు కావాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించకోలేదు. చివరకు 18 గైరోస్కోపుల కోసం తప్పుడు పత్రాలు సృష్టించాడు. చివరకు అండర్ కవర్ ఏజెంట్లకు దొరికేశాడు.
తాను పాకిస్థాన్ ప్రభుత్వం మిలటరీ కోసమే వీటిని కొంటున్నట్లు చెప్పాడు. పాశ్చాత్యదేశాల నుంచి ఇంతకుముందు లైసెన్సు లేకుండానే తమ దేశం అణు పరిజ్ఞానం కూడా తెచ్చుకుందని అతడు చెప్పాడు. రసాయన లేదా జీవ ఆయుధాలలో ఉపయోగించే రిసీవర్ మాడ్యూళ్లు కూడా తమకు కావాలని తెలిపాడట!! అతగాడు చెప్పిన వివరాలు విని విస్తుపోయిన అమెరికా హోంలాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు.. చివరకు అతడిని కోర్టుకు అప్పగించగా, ప్రస్తుతానికి అతడికి 33 నెలల జైలుశిక్ష విధించారు.