
ఐటెం సాంగ్‌లోని ఓ దృశ్యం
ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో కాఫ్ కంగనా పేరుతో ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ విభాగం నిర్మించిన చిత్రంలోని ఐటెం సాంగ్ వివాదాస్పదమైంది. ఆ పాటపై పాక్ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వివరాల్లోకెళితే.. పాక్ మిలిటరీ పీఆర్ విభాగం నిర్మించిన చిత్రం కాఫ్ కంగనా. ఈ చిత్రంలో నీలమ్ మునీర్ అనే యువతి ఐటెం సాంగ్ చేసింది. మేరే ఖ్వాబోంమే అంటూ సాగే ఈ పాట భారత్‌ను ద్వేషిస్తూ సాగుతుంది. అయితే పాటను అసభ్యకరంగా చిత్రీకరించడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఐఎస్‌పీఆర్ డీజీ ఆసిఫ్ గపూర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత్‌కు చెందిన యువతి పాత్రను నీలమ్ పోషించిందనీ, పాక్‌కు చెందిన యువతి పాత్ర కాదని సమర్థించుకున్నారు. పాట ఏ సందర్భంలో వచ్చేదీ సినిమా చూస్తే అర్థమవుతుందని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాక, ఈ చిత్రం కశ్మీర్ ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు రూపొందించిందనీ, పాట చిత్రీకరణ ఐఎస్‌పీఆర్ ప్రధాన కార్యాలయంలో కానీ, ఇస్లామాబాద్‌లో కానీ చిత్రీకరించలేదని వివరించారు.
ఈ విషయంపై నీలమ్ మునీర్ స్పందిస్తూ.. ఐఎస్‌పీఆర్ నిర్మించినందునే ఐటెం సాంగ్ చేశానని, దేశం కోసం ఇలా చేయడం తనకు తప్పనిపించలేదని పేర్కొంది. అంతేకాక, నా జీవితంలో ఇదే మొదటి ఐటెం సాంగ్. అలాగే చివరిది కూడా అని తెలిపింది. ఈ వివరణలకు పాక్ నెటిజన్లు శాంతించలేదు. గపూర్‌ను, నీలంను ట్రోల్ చేస్తున్నారు. కశ్మీర్, దేశ రక్షణ పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. కంగనా అనే హిందూ యువతి, అలీ ముస్తఫా అనే పాకిస్తాన్ ముస్లిం యువకుడి మధ్య నడిచే ప్రేమ ఈ చిత్ర కథాంశం. ఐఎస్‌పీఆర్ అనేది పాకిస్తాన్ ఆర్మీకి, ఆ దేశ పౌర సమాజానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. సైన్యం గురించిన వివరాలు, చిత్రాలు, విశేషాలు వంటివి అధికారికంగా వెల్లడించే ఒక ఆర్మీ విభాగం. అంతేకాక, సైన్యానికి సంబంధించిన అంశాలు మీడియాకు అందిస్తుంది. ఈ విభాగం నిర్మించిన చిత్రమే కాఫ్ కంగనా.
Comments
Please login to add a commentAdd a comment