విద్యుత్ బకాయిల నేపథ్యంలో పాకిస్థాన్ నిర్ణయం
ఇస్లామాబాద్: బిల్లులు చెల్లించకపోతే పేదల ఇళ్లకు, ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం తెలిసిందే.. అయితే పాకిస్థాన్‌లో విద్యుత్ బకాయిల కారణంగా దేశ పార్లమెంట్‌కు.. సుప్రీంకోర్టుకు కరెంట్ కట్ చేశారు. విద్యుత్ బిల్లులు కట్టలేదని పాకిస్థాన్ ప్రభుత్వం పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా 18 ప్రభుత్వ సంస్థలకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని బుధవారం ఉదయం ఆదేశించింది. ఈ జాబితాలో ప్రధానమంత్రి సచివాలయం, హైవే పోలీస్ హెడ్‌క్వార్టర్స్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసం, ఇస్లామాబాద్ టౌన్ హాల్ మొదలైనవి ఉన్నాయి.
పాక్ విద్యుత్, నీటి వనరుల శాఖ సహాయ మంత్రి అబిద్ షీర్ అలీ బుధవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాల మేరకు విద్యుత్ చౌర్యం నివారించేందుకు, బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభించినట్టు చెప్పారు. అయితే మధ్యాహ్నం తర్వాత ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశాలతో సుప్రీంకోర్టుకు విద్యుత్ సరఫరాను అధికారులు పునరుద్ధరించారు. గత 15 ఏళ్లలో పాకిస్థాన్‌లో విద్యుత్ వినియోగం 70 శాతం పెరిగింది. దీంతో విద్యుత్ చౌర్యం, బిల్లు బకాయిలు పెరిగిపోయాయి. వేసవి కావడంతో దేశంలో విద్యుత్‌కు తీవ్ర కొరత ఏర్పడటంతో బకాయిల వసూలుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పార్లమెంట్, సుప్రీంలకు కరెంట్ కట్!
Published Thu, May 1 2014 2:47 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement