ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా! | Senator and minister have a nasty fight in Pakistan Parliament | Sakshi
Sakshi News home page

ఇంటి వద్ద కట్టేసి వచ్చాగా.. ఐనా పార్లమెంటుకొచ్చావా!

Aug 8 2019 4:57 PM | Updated on Aug 8 2019 5:13 PM

Senator and minister have a nasty fight in Pakistan Parliament - Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ను రద్దు చేసిన నేపథ్యంలో జరిగిన పాకిస్థాన్‌ సంయుక్త పార్లమెంటు సమావేశంలో తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రతిపక్ష పీఎంఎల్‌-ఎన్‌ సెనేటర్‌ ముషాహిద్‌ ఉల్లా ఖాన్‌, కేంద్ర మంత్రి ఫవాద్‌ చౌదరి మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తున్నట్టు భారత్‌ ప్రకటించడంతో ఈ అంశంపై చర్చించేందుకు హుటాహుటిన పాక్‌ సంయుక్త పార్లమెంటరీ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సెనేటర్‌ ముషాహిద్‌ మాట్లాడుతూ.. పాక్‌లో అభివృద్ధి విషయమై ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

తాను మాట్లాడుతున్న సమయంలో ఫవాద్‌ అడ్డుపడటంతో ఆగ్రహానికి లోనై ముషాహిద్‌ ఉల్లా ఖాన్‌.. ఆయనను కుక్కతో పోల్చారు. ‘ఈ పిరికివాడే మొత్తం మాట్లాడుతున్నాడు. వాణ్ని నేను ఇంటి దగ్గర వదిలేసి వచ్చా. అయినా తిరిగొచ్చింది. నేను నిన్ను ఇంటి దగ్గర కట్టేసి వచ్చాను కదా’ అంటూ ఫవాద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనను కుక్కతో పోల్చడంతో కోపోద్రిక్తుడైన ఫవాద్‌.. నిన్ను చెప్పుతో కొడతానంటు ఎదురుదాడికి దిగారు. నోటికొచ్చినట్టు తిడుతూ ముషాహిద్‌పై దాడి చేసేలా  ఫవాద్‌ దూసుకొచ్చారు. అయితే, తోటి సభ్యులు ఆయనను అడ్డుకున్నారు. మరోవైపు ‘షటప్‌.. షటప్‌’ అంటూ ముషాహిద్‌ గద్దించారు. స్పీకర్‌ ఎంతగా అభ్యర్థించినా ఏమాత్రం పట్టించుకోకుండా వారు ఇలా రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పార్లమెంటు సభ్యులు ఒకరినొకరు కుక్కలతో పోల్చుకోవడంతో.. చెప్పుతో కొడతాననడం ఫన్నీగా ఉందని, ఈ వీడియో చూస్తే నవ్వు ఆగడం లేదని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement