భారత పార్లమెంటు నివాళి
- పెషావర్ మృతులకు సంతాపం తెలిపిన ఎంపీలు
- ఘటనను ఖండిస్తూ తీర్మానం; బాధితులకు సంతాపం
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని పెషావర్ మారణకాండలో చనిపోయిన చిన్నారులకు పార్లమెంటు బుధవారం నివాళులు అర్పించింది. బాధిత కుటుంబాలకు సంఘీభావం ప్రకటించింది. సిడ్నీ, పెషావర్ వంటి ఘటనలు ప్రపంచ దేశాలన్నింటికీ హెచ్చరికలాంటివని... మానవత్వంపై నమ్మకమున్నవారందరూ ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి చేతులు కలపాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు పెషావర్‌లో ఉగ్రవాద ఘాతుకానికి బలైన చిన్నారులకు నివాళిగా లోక్‌సభ, రాజ్యసభల్లో సభ్యులంతా కొంతసేపు నిలబడి మౌనం పాటించారు.
తొలుత పెషావర్ ఘటనలో బాధిత కుటుంబాలు, పాకిస్తాన్ ప్రజలకు సంతాపం వ్యక్తం చేస్తూ.. స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని లోక్‌సభ ఆమోదించింది. ఉగ్రవాదం పట్ల ఏ మాత్రం కూడా సహనం చూపకుండా, కఠినంగా వ్యవహరించాలని తీర్మానంలో పేర్కొంది. ఇక రాజ్యసభలోనూ సభ్యులంతా కొంత సేపు మౌనం పాటించారు. అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి, చైర్మన్ హమీద్ అన్సారీ పేర్కొన్నారు. అనంతరం సభను వాయిదా వేశారు.
ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంటు ఉభయ సభల్లో ప్రసంగిస్తూ... సిడ్నీ, పెషావర్ ఘటనలను ఖండించారు. ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి అందరూ ఉమ్మడిగా కృషి చేయాలని... ఇందుకోసం భారత్ సంసిద్ధంగా ఉందని ఆమె పేర్కొన్నారు. పాఠశాలలో చొరబడి అత్యంత పాశవికంగా 132 మంది చిన్నారులను బలిగొన్న ఈ ఘటనను మొత్తం ప్రపంచం ఖండిస్తోందన్నారు.
సరిహద్దులు, విభేదాలకు అతీతంగా భారత్ ఆ ఘటనపై స్పందించిందని, సానుభూతిని ప్రకటించిందని తెలిపారు. దీనిపై ప్రధాని మోదీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మాట్లాడి మన దేశ ప్రజల తరఫున సంఘీభావం తెలిపారని సుష్మా చెప్పారు. రెండు రోజుల కింద సిడ్నీలో జరిగి ఉగ్రవాద ఘాతుకాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఉగ్రవాదం ప్రపంచం మొత్తానికీ ముప్పుగా పరిణమించిందని వ్యాఖ్యానించారు.
స్కూళ్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేయండి
పాక్ సైనిక స్కూల్లో ఉగ్రవాదులు నెత్తుటేర్లు పారించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విద్యాసంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించింది. అలాగే షాపింగ్ మాల్స్ వద్ద కూడా భద్రతను పెంచాలని పేర్కొంది. బుధవారం పార్లమెంట్ బయట కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు.
ఉగ్రవాద దాడి జరిగితే ఏం చేయాలి? పిల్లల్ని ఎలా అప్రమత్తం చేయాలి? అన్న విషయాలపై స్కూళ్లకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ఒబామా వచ్చే నెల భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉందంటూ కేంద్రం బుధవారం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దాడులు జరిగే అవకాశమున్న ప్రదేశాలు, కట్టడాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది.