
గ్లోబల్ సర్వేలో మోదీ నంబర్ 1
బీజింగ్: దేశీయ, అంతర్జాతీయ వ్యవహారాల నిర్వహణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వల్ప తేడాతో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను అధిగమించి మొదటి స్థానంలో నిలిచారు. చైనాకు చెందిన సంస్థ చేసిన నేషనల్ ఇమేజ్ గ్లోబల్ సర్వే-2014లో ఈ మేరకు వెల్లడైంది. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణాఫ్రికా, భారత్, రష్యా, బ్రెజిల్, చైనాలలో 4500 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే చేశారు. ఈ వివరాలను బుధవారం వెల్లడించారు.
మొత్తం 5 పాయింట్లకు గాను మోదీ 3.74 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలవగా, జిన్‌పింగ్ 3.58 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. తొమ్మిది దేశాలలోని ప్రఖ్యాత నాయకులలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, రష్యా అధ్యక్షుడు పుతిన్, బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్, జిన్‌పింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.