మోదీ, ఒబామా ఆత్మీయ ఆలింగనం
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయ్యారు. వైట్హౌస్ కు చేరుకున్న ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ఆత్మీయ ఆలింగనం చేసుకుని ఘన స్వాగతం పలికారు. భారత్లో గణతంత్ర్య దినోత్సవ వేడుకలలో తాను పాల్గొన్న రోజులను ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. అమెరికాతో కలిసి పని చేయడానికి సిద్ధమని, ఎన్నో సమస్యలపై పోరాడతామని మోదీ పేర్కొన్నారు.
పలు సమస్యలపై ఒబామాతో చర్చించామని, తనను ఇక్కడకు ఆహ్వానించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ యంగ్ కంట్రీ అని, దేశంలో 80 కోట్ల జనాభా 35 ఏళ్లలోపు వారేనని చెప్పారు. దేశ యువకులు అమెరికాతో కలిసి పనిచేస్తే ఎన్నో అవకాశాలు లభిస్తాయన్నారు. పౌర అణు సహకారం, ప్రాంతీయ సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చించామని ప్రధాని మోదీ తెలిపారు. ద్వైపాక్షిక అంశాలపై కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. జీ20 సదస్సులో మరోసారి ఒబామాతో సమావేశం అవుతామని ప్రధాని మోదీ వెల్లడించారు.