ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి ఒబామా ఓటు | Obama vote to NSG Membership | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి ఒబామా ఓటు

Published Wed, Jun 8 2016 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి ఒబామా ఓటు - Sakshi

ఎన్‌ఎస్‌జీ సభ్యత్వానికి ఒబామా ఓటు

మోదీతో భేటీలో అమెరికా మద్దతు ప్రకటించిన అధ్యక్షుడు
- అమెరికా అధినేతతో భారత ప్రధాని ఏడోసారి భేటీ.. పలు అంశాలపై చర్చలు
 
 వాషింగ్టన్: అణు సరఫరాదారుల బృందం(ఎన్‌ఎస్‌జీ)లో భారత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మద్దతు ప్రకటించారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం వాషింగ్టన్‌లోని అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో ఒమామాతో భేటీ అయ్యారు. గత రెండేళ్లలో ఇరువురు అగ్ర నేతలూ భేటీ కావటం ఇది ఏడోసారి.  గంట పాటు సాగిన ఈ భేటీలో.. ఎన్‌ఎస్‌జీలో భారత సభ్యత్వం, క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ(ఎంటీసీఆర్)లో భారత్ ప్రవేశం, వాతావరణ మార్పు, ద్వైపాక్షిక పెట్టుబడులు, వాణిజ్యం తదితర అంశాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లే మార్గాలపై మంతనాలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలూ సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా.. ప్రజల మధ్య పరస్పరం బలమైన సంబంధాలున్న భారత్, అమెరికాలు తమ భాగస్వామ్యాన్ని విస్తరించుకోవటం సహజమని ఒబామా పేర్కొన్నారు. ఇరువురమూ విస్తృత అంశాలపై చర్చించామని, ప్రత్యేకించి ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్లటం గురించి మాట్లాడామని మోదీ తెలిపారు. ముఖ్యాంశాలు వారి మాటల్లోనే...

 భారత ప్రగతికి సాంకేతికత అవసరం: ఒబామా
 ‘‘ఎన్‌ఎస్‌జీలో భారత్ భాగస్వామ్యానికి నేను మద్దతు తెలిపాను. భారత్ తన ప్రగతికి, సుసంపన్నత సాధించటానికి సాంకేతిక పరిజ్ఞానం కీలకం. అది భారత్‌కు అవసరం. పౌర అణు ఒప్పందంపై పురోగతి పైనా చర్చించాం. అణు పదార్థాలు, సాంకేతికత వ్యాప్తి నిరోధం గురించి కూడా చర్చించాం. అణు భద్రత శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి (మోదీ) చాలా క్రియాశీలంగా సమర్థవంతంగా పాల్గొన్నారని కూడా నేను ప్రస్తావించాను. భద్రతకు సంబంధించి పాత సవాళ్లతో పాటు.. సైబర్ భద్రత వంటి కొత్త సవాళ్ల గురించీ చర్చించాం. వాతావరణ మార్పుపై పారిస్ ఒప్పందాన్ని సాధ్యమైనంత త్వరగా ఎలా అమలులోకి తీసుకురాగలమనే దానిపై చర్చించాం. ప్రధాని మోదీ రచించిన సౌరశక్తి, పరిశుభ్ర ఇంధనం ప్రణాళికలపై ఎలా ముందుకు వెళ్లటం అనే దాని గురించి మాట్లాడాం. ముఖ్యమైన ప్రాంతీయ అంశాలపైనా మాట్లాడాం. శాంతి, అభివృద్ధి ఆకాంక్షలను, క్లిష్టమైన అంశాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలన్న అంశాలపై భారత్, అమెరికాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయి.’’
 
 కొత్త రంగాల్లో కలిసి పనిచేయాలి: మోదీ
 ‘‘ఎంటీసీఆర్, ఎన్‌ఎస్‌జీల్లో సభ్యత్వాలకు నా మిత్రుడు, అధ్యక్షుడు ఒబామా చేసిన సాయం, ఇచ్చిన మద్దతుకు నేను కృతజ్ఞుడ్ని. భారత్, అమెరికాలు కేవలం ఇరు దేశాలే కాకుండా ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనటానికి భుజం భుజం కలిపి పనిచేశాయి. వాతావరణ మార్పు, అణు భద్రత, ఉగ్రవాదం వంటి ప్రపంచ అంశాలపై భారత్, అమెరికాలు సహకరించుకుంటున్నాయి. కేవలం మిత్రులుగానే కాదు.. రెండు దేశాలుగా పనిచేయటం పట్ల నేను గర్వంగా భావిస్తున్నా. మేం భుజం భుజం కలిపి పనిచేయటం కొనసాగిస్తాం. మనం కొత్త రంగాల్లో ఎంత ఎక్కువగా కలిసి పనిచేస్తే.. అంత ఎక్కువగా ప్రపంచానికీ, మన రెండు దేశాలకూ కూడా ప్రయోజనం కలుగుతుంది. అది మన స్వప్నం. భారత్‌లోని 35 ఏళ్ల లోపున్న 80 కోట్ల యువత నైపుణ్యాల గురించి అమెరికాకు బాగా తెలుసు. మా యువశక్తి అమెరికాతో కలిసి కొత్త శిఖరాలకు చేరుకోవటానికి కృషి చేయగలదు. ప్రపంచంలో ఇప్పుడు అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్.. మన రెండు దేశాలూ మరిన్ని కొత్త రంగాల్లో సహకరించుకోవాలి. నేను, ఒబామా మళ్లీ సెప్టెంబర్ నెలలో జీ-20 శిఖరాగ్ర సదస్సు (చైనా)లో కలుస్తాం. అప్పటికల్లా.. వాతావరణం, న్యాయం సహా చాలా రంగాల్లో పురోగతి సాధించగలమని నేను ఆశిస్తున్నా.’’

 మోదీ నాయకత్వం కొత్త ఉత్సాహాన్నిస్తుంది...
 మోదీని ఒబామా సాదరంగా కౌగిలించుకుని ఆహ్వానించారు. ‘‘ఓవల్ కార్యాలయంలోకి నా మిత్రుడ్ని తిరిగి ఆహ్వానించటం నాకు చాలా సంతోషకరం. మోదీ నాయకత్వం కేవలం భారతీయ అమెరికన్లలోనే కాదు, అమెరికన్లలో కూడా కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తుంది’’ అంటూ కితాబునిచ్చారు. గత ఏడాది జనవరిలో భారత గణతంత్ర దినోత్సవానికి తాను ముఖ్య అతిథిగా హాజరవటం గురించి ఒబామా గుర్తుచేస్తూ అక్కడ తనకు అపూర్వ ఆతిథ్యం లభించిందన్నారు. చర్చలు ముగిసి, మీడియాతో మాట్లాడిన అనంతరం మోదీకి ఒబామా మధ్యాహ్న విందు ఇచ్చారు. ఈ విందు భేటీలోనూ చర్చలు కొనసాగించారు. ఒబామాతో భేటీ ముగిశాక.. వ్యాపార దిగ్గజాల సమావేశానికి మోదీ హాజరయ్యారు. ఆయన ఆ తర్వాత అమెరికా - భారత్ వాణిజ్య మండలి వార్షిక సర్వసభ్య భేటీలో ప్రసంగించారు. బుధవారం అమెరికా కాంగ్రెస్ (పార్లమెంటు) ఉభయసభల సంయుక్త సమావేశంలో మోదీ ప్రసంగిస్తారు. అనంతరం మెక్సికో పర్యటనకు వెళ్తారు.
 
 క్షిపణి విపణిలోకి భారత్.. ఎంటీసీఆర్‌లో సభ్యత్వం ఖరారు
 న్యూఢిల్లీ: అంతర్జాతీయ వేదికపై భారత్‌కు మరో విజయం! క్షిపణి సాంకేతికత నియంత్రణ వ్యవస్థ (ఎంటీసీఆర్)లో భారత్‌ను సభ్యదేశంగా చేర్చుకోవటానికి అందులోని సభ్యదేశాలన్నీ ఆమోదం తెలిపాయి. మొత్తం 34 సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశమూ భారత్ చేరికకు అభ్యంతరం తెలుపలేదని దౌత్యవేత్తలు మంగళవారం వెల్లడించారు. భారత్ దరఖాస్తుపై అభ్యంతరాలను వ్యక్తం చేయటానికి సోమవార (జూన్ 6) తుది గడువు కాగా.. ఏ దేశం నుంచీ అభ్యంతరం రాలేదు. ఎంటీసీఆర్ సభ్య దేశాల నుంచి అభ్యంతరాలు రాకపోతే దరఖాస్తు చేసుకున్న దేశానికి సభ్యత్వం లభించినట్లేనన్న ఆ వ్యవస్థ అనుసరిస్తున్న విధానం మేరకు.. భారత్ సభ్యత్వానికి ఆమోదం లభించినట్లేనని ఆ సంస్థకు చెందిన దౌత్యవేత్తలు పేర్కొన్నారు. ప్రధాని మోదీ మంగళవారం అమెరికా పర్యటనలో ఆ దేశాధ్యక్షుడుఒబామాతో భేటీ కావటానికి ముందు ఈ పరిణామం చోటు చేసుకోవటం విశేషం.

 ఏమిటీ ఎంటీసీఆర్?
 అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంలో భాగంగా.. అణ్వస్త్రాలు, రసాయన, జీవరసాయన సామూహిక జనహనన మారణాయుధాలను ప్రయోగించేందుకు వీలుకలిగించే క్షిపణులు, వాటి సాంకేతిక పరిజ్ఞానం వ్యాప్తిని నియంత్రించేందుకు 1987లో అప్పటి జీ7 కూటమిగా ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు దీనిని నెలకొల్పాయి. ఇసభ్యదేశాలు 500 కిలోలు అంతకుమించి పేలోడ్‌ను మోసుకెళ్లగల, 300 కి.మీ. అంతకు మించిన దూరానికి ప్రయాణించి ఎసామూహిక జనహనన మారణాయుధాన్నైనా ప్రయోగించగల క్షిపణులు, సంబంధిత సాంకేతికతల ఎగుమతులపై నియంత్రణ పాటిస్తాయి.

 భారత్‌కు లాభాలేమిటి?
 ఎంటీసీఆర్ సభ్య దేశంగా భారత్.. ఉన్నతస్థాయి ఆదునిక క్షిపణి సాంకేతికతను కొనుగోలు చేయగలగటమే కాకుండా.. ఎగుమతి కూడా చేయగలదు. ప్రత్యేకించి లక్షిత ప్రాంతాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగల ప్రిడేటర్ డ్రోన్లను కూడా అమెరికా నుంచి కొనుక్కునే వీలు కలుగుతుంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల తన క్షిపణులను భారత్ సైతం ఎగుమతి చేయగలదు. ప్రధానంగా భారత్, రష్యాలు కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించేందుకు వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement