వామ్మో వైరస్! ఒలింపిక్స్ వాయిదా వేయండి!
వాషింగ్టన్: బ్రెజిల్‌లో జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రియో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలి లేదా వేరోచోటుకి తరలించాలని 100 మందికిపైగా ప్రముఖ వైద్యులు, ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు రాసిన బహిరంగ లేఖలో కోరారు.
'జికా వైరస్ వ్యాప్తి తీవ్రంగా విజృంభిస్తుండటంతో తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నామని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ మార్గరేట్ చాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 'ప్రపంచ ఆరోగ్యంపై ఆందోళనతోనే మేం ఈ లేఖ రాస్తున్నాం. బ్రెజిల్‌లో విశ్వక్రీడల వల్ల సైన్స్ గతంలో కనీవినీ ఎరుగనిరీతిలో జికా వైరస్ విజృంభించే అవకాశముంది' అని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, ఒలింపిక్స్ క్రీడలను రద్దు చేయడం లేదా వేరేచోటుకు మార్చడం వల్ల అంతర్జాతీయంగా జికా వైరస్ వ్యాప్తిలో ఎలాంటి మార్పు ఉండబోదని తమ ప్రాథమిక పరిశోధనలో తేలిందని డబ్ల్యూహెచ్‌వో తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.