ఆహారం బాగుంటే అది మనకు జవసత్వాలనిస్తుంది. అది కలుషితమైతే మన ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది.. ఒక్కోసారి ప్రాణాన్నే తీస్తుంది! అందుకని, మనకు ప్రమాణాలతో కూడిన శుద్ధమైన ఆహారం కావాలి. ఆహార భద్రతలో దీని పాత్ర కీలకం. అంతే కాదు, ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. కలుషిత లేదా నాణ్యత లేని ఆహారం వల్ల ప్రతి సంవత్సరం 60 కోట్ల మంది దాదాపు 200 రకాల అనారోగ్యాల పాలవుతున్నారు.
బాధితుల్లో ఎక్కువ మంది పేదలు, పిల్లలు, యువతే. ఇందులో ప్రతి ఏటా 4 లక్షల 20 వేల మంది చనిపోతున్నారు. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలను అరికడితే ఈ మరణాలను నివారించవచ్చు. అందుకే, ఈ అంశంపై ప్రజల్లో చైతన్యాన్ని కలిగించేందుకు జూన్ 7న ప్రపంచ ఆహార భద్రతా ప్రమాణాల దినోత్సవం జరుపుకుంటున్నాం.
ప్రతి 10 మందిలో ఒకరు!
►ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు కలుషిత ఆహారం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. పేద, ధనిక అని తేడా లేదు. అన్ని దేశాల్లోనూ ఆహార నాణ్యతా సమస్యలు తలెత్తుతున్నాయి.
►బాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు లేదా భార లోహాలు వంటి రసాయన పదార్థాలతో కలుషితమైన ఆహారం తినడం వల్ల 200కు పైగా వ్యాధులు వస్తున్నాయి.
5 సంవత్సరాల కంటే తక్కువ వయస్కులైన పిల్లలు జనాభాలో 9 శాతం ఉన్నారు, అయితే, ఆహార వ్యాధిగ్రస్తుల్లో 40 శాతం మంది వీరే.
► అందువల్ల ఆహార భద్రతా ప్రమాణాలు పాటిస్తే.. అవి అందరి ప్రాణాలనే కాదు, అనేకమంది జీవనోపాధిని కూడా కాపాడతాయి.
►వినియోగదారులను రక్షించడంలో, ఆహారోత్పత్తిపై విశ్వాసాన్ని కలిగించడంలో ఆహార భద్రతా ప్రమాణాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి.
► ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా 1963లో ఏర్పాటైన కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్.. గత 60 సంవత్సరాలుగా అంతర్జాతీయ ఆహార ప్రమాణాలను నిర్దేశిస్తోంది.
►236 ప్రమాణాలు, 84 మార్గదర్శకాలు, 56 ఆచరణాత్మక నియమాలు ఉన్నాయి. ఆహారంలో కలుషితాల గరిష్ట స్థాయికి సంబంధించిన 126 ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. వీటితో పాటు.. ఆహారోత్పత్తుల తయారీ ప్రక్రియలో కలిపే పదార్థాలకు సంబంధించి.. పురుగుమందుల అవశేషాలు, పశువైద్యంలో వాడే ఔషధాల అవశేషాల గరిష్ట స్థాయిలకు సంబంధించిన 10 వేలకు పైగా పరిమాణాత్మక ప్రమాణాలను కోడెక్స్ అలిమెంటారియస్ కమిషన్ నిర్దేశిస్తోంది.
►పశువైద్యంలో ఉపయోగించే యాంటీమైక్రోబయల్ ఔషధాలకు లొంగని మొండి సూక్ష్మక్రిములతో సోకే ఇన్ఫెక్షన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 50 లక్షల మంది మరణిస్తున్నారని అంచనా. ఈ మరణాలను తగ్గించేందుకు కూడా ఆహార భద్రతా ప్రమాణాలను కోడెక్స్ నిర్దేశిస్తోంది. 2016 నుంచి 50 అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.
► సురక్షితమైన, పోషకవంతమైన ఆహారం మేధో, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా పిల్లల పెరుగుదలకు, అభివృద్ధికి దోహదపడుతుంది.
►ఐరాస నిర్దేశిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ఆహార భద్రతా ప్రమాణాలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.
– పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్
Comments
Please login to add a commentAdd a comment