శాంతి కపోతం ఎగిరేనా..? | President Trump to Meet Kim Jong-un of North Korea | Sakshi
Sakshi News home page

శాంతి కపోతం ఎగిరేనా..?

Published Tue, Jun 12 2018 1:51 AM | Last Updated on Tue, Jun 12 2018 8:21 AM

 President Trump to Meet Kim Jong-un of North Korea - Sakshi

సింగపూర్‌: నేడే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ల మధ్య శిఖరాగ్ర సమావేశం.. కొద్ది నెలల క్రితం వరకూ పరస్పరం తిట్టిపోసుకున్న ఈ ఇద్దరు నేతలు సింగపూర్‌ వేదికగా కీలక చర్చలు జరపనున్నారు. ఉత్తర కొరియాను అణునిరాయుధీకరణకు ఒప్పించడమే ప్రధాన ఎజెండాగా సింగపూర్‌లోని కపెల్లా హోటల్లో అమెరికా, ఉ.కొరియా అధినేతల మధ్య ఈ శిఖరాగ్ర సమావేశం(భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు) జరుగుతోంది.  ఈ చరిత్రాత్మక భేటీలో ట్రంప్‌ షరతులకు కిమ్‌ తలొగ్గుతారా? అణ్వాయుధాల్ని పూర్తిగా విడిచిపెట్టేందుకు అంగీకరిస్తారా? అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

దూకుడుగా వ్యవహరించే ఈ ఇద్దరు నేతల మధ్య సయోధ్య కుదరడం సాధ్యమా? అన్న అనుమానాల నడుమ ఈ సదస్సు ట్రంప్‌ సామర్థ్యానికి సవాలుగా నిలవనుంది. చర్చల కోసం అమెరికాను ఒప్పించేందుకు ఎన్నో మెట్లు దిగివచ్చిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఎలా వ్యవహరిస్తారన్న అంశంపైనా అందరి దృష్టి నెలకొంది. అణునిరాయుధీకరణ విషయంలో ఉత్తర కొరియాపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యమని అమెరికా స్పష్టం చేయగా ఉత్తర కొరియా ఎజెండాపై స్పష్టత ఇవ్వలేదు. కిమ్‌తో ఇది ఆసక్తికరమైన సమావేశం అవుతుందని మంచి ఫలితాన్ని ఆశిస్తున్నామని ట్రంప్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు, ఉత్తర కొరియా నేత మధ్య ముఖాముఖి చర్చలు జరగడం ఇదే తొలిసారి.  

అణు నిరాయుధీకరణే మాకు ఆమోద యోగ్యం: అమెరికా
అయితే అణునిరాయుధీకరణ ఒప్పుకునేంత వరకూ ఉత్తర కొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని పాంపియో చెప్పారు.  ‘సమావేశానికి ముందు సన్నాహక చర్చలు ఉత్సాహపూరితంగా జరిగాయి. మంగళవారం నాటి భేటీలో ఇరు దేశాల అధినేతలు సరైన పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాం. ఈ సమావేశం కోసం ట్రంప్‌ నమ్మకంతో ఉన్నారు. కిమ్‌ అణునిరాయుధీకరణకు అంగీకరించడంతో పాటు ఇక ఎన్నడూ అణు పరీక్షల జోలికి పోనని హామీ ఇస్తే ఉత్తర కొరియాకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే ట్రంప్‌ స్పష్టం చేశారు. ఈ శిఖరాగ్ర సదస్సులో ఉత్తర కొరియా నుంచి సంపూర్ణ అణు నిరాయుధీకరణను అమెరికా ఆశిస్తోంది’ అని ఆయన తెలిపారు. ఉత్తర కొరియా విషయంలో గతంలో అమెరికా అధ్యక్షులు మోసపోయారని, అయితే ట్రంప్‌ మాత్రం పక్కాగా ముందుకెళ్తున్నారని పాంపియో పేర్కొన్నారు.

అమెరికాకు నమ్మకం కల్గించే చర్యల్ని ఉత్తర కొరియా చేపట్టడమే అందుకు నిదర్శనమన్నారు. ‘ఇరు దేశాల మధ్య సంబంధాల్లో మార్పునకు, ఉత్తర కొరియాలో శాంతి, శ్రేయస్సు కోసం కిమ్‌కు ఊహించని అవకాశం వచ్చిందని ట్రంప్‌ భావిస్తున్నారు. ఇరు దేశాల ప్రజలకే కాకుండా, మొత్తం ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూర్చే ఫలితాన్ని సాధిస్తామనేందుకు ఇరువురు నేతల మధ్య ముఖాముఖి చర్చలు జరపడమే సంకేతం’ అని ఆయన చెప్పారు.  ఇరు దేశాల మధ్య కొత్త సంబంధాలు నెలకొల్పేలా, శాశ్వత, స్థిరమైన శాంతి స్థాపన కోసం యంత్రాంగాన్ని ఏర్పాటయ్యేలా, కొరియా ద్వీపకల్పంలో అణునిరాయుధీకరణ నిజమయ్యేలా ఉత్తర కొరియా– అమెరికా మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు అభిప్రాయాల్ని పంచుకుంటారని ఉత్తర కొరియా ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది.

మూడ్రోజుల ముందే ట్రంప్‌ బర్త్‌డే వేడుక
మూడ్రోజుల ముందుగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఉ.కొరియా అధినేత కిమ్‌తో భేటీ కోసం సింగపూర్‌లో ఉన్న ట్రంప్‌ శనివారం ఆ దేశ అధ్యక్షుడు లీ సిన్‌ లూంగ్‌తో భేటీ అయ్యారు. శిఖరాగ్ర సదస్సు కోసం ఏర్పాట్లు చేసినందుకు లీకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా లీ.. ట్రంప్‌తో కేకు కోయించి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. జూన్‌ 14న ట్రంప్‌ 72వ ఏట అడుగుపెడుతున్నారు.

భారత సంతతి మంత్రుల కనుసన్నల్లో..
ట్రంప్‌–కిమ్‌ల సమావేశానికి సింగపూర్‌ ఇస్తున్న ఆతిథ్యాన్ని దగ్గరుండి చూసుకుంటున్నది ఇద్దరు భారత సంతతి మంత్రులే. వివియన్‌ బాలకృష్ణన్‌ (సింగపూర్‌ విదేశాంగ మంత్రి), కె షణ్ముగం (న్యాయ, హోంశాఖ మంత్రి)లు ఈ సమావేశానికి ఎలాంటి అవాంతరాల్లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సదస్సు నిర్వహణకు అవుతున్న 15 మిలియన్‌ డాలర్ల ఖర్చు (దాదాపు రూ.100కోట్లు)ను సింగపూర్‌ ప్రభుత్వమే భరిస్తోంది. ఇందులో సగం భద్రతకే వెచ్చిస్తోందని సింగపూర్‌ ప్రధాని లీ సీన్‌ లూంగ్‌ వెల్లడించారు.

సింగపూర్‌ వీధుల్లో కిమ్‌ షికారు
ఎప్పుడూ కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉండే ఉ.కొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోమవారం రాత్రి సింగపూర్‌ వీధుల్లో స్వేచ్ఛగా విహరించారు. అంతేకాకుండా సింగపూర్‌ విదేశాంగ మంత్రి వివియన్‌ బాలకృష్ణన్, విద్యాశాఖ మంత్రి ఆంగ్‌ ఏ కుంగ్‌లతో కలసి సెల్ఫీలు దిగారు. దీంతోపాటు దేశంలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా కిమ్‌తో దిగిన సెల్ఫీని బాలకృష్ణన్‌ ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది. కిమ్‌ సెల్ఫీ దిగడం నమ్మలేకపోతున్నామని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు.

కిమ్‌ను ఊరించేందుకు అమెరికా యత్నం
ట్రంప్‌–కిమ్‌ల భేటీకి సన్నాహకంగా సోమవారం అమెరికా, ఉ.కొరియా దౌత్య ప్రతినిధులు సింగపూర్‌లో వరుస చర్చలు కొనసాగించారు. ఉ.కొరియా శాశ్వత అణునిరాయుధీకరణకు ఒప్పుకుంటే అనేక ప్రయోజనాలు చేకూర్చేందుకు సిద్ధమని అమెరికా ప్రకటించింది. పలు అంశాలపై పూచీకత్తు ఇస్తామని ఉ.కొరియాను ఊరించే ప్రయత్నం చేసింది. అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో సింగపూర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ అణునిరాయు ధీకరణతో తామేదో నష్టపోయామని భావించకుండా.. వారు సౌకర్యవంతంగా ఉండేలా కోరినంత అభయమిస్తాం’ అని పేర్కొన్నారు.

3వేల మంది జర్నలిస్టులు
ట్రంప్‌–కిమ్‌ మధ్య మంగళవారం నాటి భేటీ వివరాలను ప్రపంచానికి వివరించేందుకు వివిధ దేశాల నుంచి దాదాపు 3వేల మంది జర్నలిస్టులు సింగపూర్‌కు వచ్చారు. ఆసియాలో జరిగే కార్యక్రమంలో ఈ స్థాయిలో అంతర్జాతీయ జర్నలిస్టులు రావడం ఇదే తొలిసారి. ‘ఈ ఇద్దరు నేతల వ్యవహార శైలి, మాట్లాడే విధానం ఆసక్తికరంగా ఉంటాయి. ఇది టీవీ కవరేజ్‌కి చాలా బాగుంటుంది. అందుకే వీరి భేటీకి ఇంత క్రేజ్‌’ అని తైవాన్‌కు చెందిన పీటర్‌ వాంగ్‌ అనే జర్నలిస్టు పేర్కొన్నారు. ‘సమావేశం ఫలప్రదమైతే అంతర్జాతీయంగా సానుకూల ప్రభావం ఉంటుంది’ అని మరో జర్నలిస్టు తెలిపారు.  

భారతీయ వంటకాలు
భేటీని కవర్‌చేయడానికి వచ్చే జర్నలిస్టుల కోసం వివిధ దేశాల ప్రఖ్యాత వంటకాలతో స్పెషల్‌ మెనూను సిద్ధం చేశారు. 15 రకాల క్విజిన్స్, 45 రకాల వంటకాలు ఈ మెనూలో ఉన్నాయి. ఇందులో ప్రముఖ భారతీయ వంటకాలైన చికెన్‌ కుర్మా, పులావ్, ఫిష్‌ కర్రీ, దాల్, పాపడ్‌ ఉన్నాయి. సింగపూరియన్, మలేసియన్, వియత్నమీజ్, థాయ్, కొరియన్, జపనీస్, చైనీస్, ఫ్రెంచ్, అమెరికన్, ఇటాలియన్, ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్, బ్రెజీలియన్‌ సహా పలు దేశాల వంటకాలను సిద్ధం చేస్తున్నారు. జర్నలిస్టుల భోజన ఏర్పాట్లను సింగపూర్‌కు చెందిన కామన్‌గుడ్‌ సంస్థ చూస్తోంది.

నేపాలీ గుర్ఖాలతో భద్రత
ఈ సమావేశానికి సింగపూర్‌ ప్రభుత్వం నేపాలీ గుర్ఖాలతో భద్రతను ఏర్పాటుచేసింది. పొడవైన సంప్రదాయ ఖడ్గం(కుక్రీ)తో గస్తీ కాసే ఈ బృందం అవసరమైతే రక్తం కళ్లచూసేందుకు కూడా వెనకాడదు. సింగపూర్‌ భద్రతా విభాగంలో నేపాలీ గుర్ఖా పోలీస్‌ ఆఫీసర్ల పేరుతో ఓ ప్రత్యేక వింగ్‌ (1949 నుంచి) ఉంది. తలపై ముదురుగోధుమ రంగు టోపీ, చేతిలో ఖడ్గంతోపాటు రైఫిల్‌ వీరి వద్ద ఉంటుంది. ఈ భేటీలో కీలకమైన అంచెలో ఈ నేపాలీ గుర్ఖాలతో భద్రత ఏర్పాటుచేశారు. ఏమాత్రం తేడా అనిపించినా ఆదేశాలకు అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తారని ఈ వింగ్‌కు సింగపూర్‌ పోలీసు విభాగంలో ప్రత్యేకమైన పేరుంది. ఈ బృందం హోటల్, దీవి భద్రతను చూస్తోంది.


                        సింగపూర్‌లోని మరీనా బే శాండ్స్‌ హోటల్‌ వద్ద అభివాదం చేస్తున్న కిమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement