
డయానా శృంగార జీవిత రహస్యాలు వెలుగులోకి!
లండన్: ప్రిన్సెస్ డయానాకు చెందిన ప్రైవేట్ టేపులను విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. రాయల్ కుటుంబం వద్దని వారిస్తున్నా లెక్కచేయకుండా బ్రిటన్‌కు చెందిన బ్రాడ్ కాస్టర్ చానెల్ 4 ఆదివారం వాటిని బహిర్గతం చేయనుంది. టీవీ డాక్యుమెంటరీ రూపంలో ఉన్న ఈ ప్రైవేట్ టేపుల్లో డయానా వ్యక్తిగత లైంగిక జీవితం, వివాహం తర్వాత ప్రిన్స్ చార్లెస్ పట్ల ఉన్న అసంతృప్తి వంటి తదితరమైన అంశాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. దీంతో ప్రస్తుతం రాయల్ కుటుంబం ఆలోచనలో పడింది. అనుమానాస్పదస్థితిలో ప్రిన్సెస్ డయానా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే.
అయితే, అంతకుముందే తన భర్త ప్రిన్స్ చార్లెస్‌తో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉండేది. లైంగిక జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందంటూ పలుమార్లు ఆమె చెప్పినట్లు కథనాలు వచ్చాయి. అయితే, పలుటీవీ చానెల్‌లు రేడియో సంస్థలు ఆమె బతికున్న రోజుల్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. వాటిల్లో కొన్ని ఇప్పటికే బయటకు రాగా ఇంకా రావాల్సినవి చాలా ఉన్నాయి. వచ్చే నెలలో డయానా వర్థంతి నేపథ్యంలో ఆమె శృంగార జీవితానికి సంబంధించిన రహస్యాలను చానెల్ 4 విడుదల చేయనుంది.
అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ టేపుల్లో చార్లెస్‌కు డయానాకు మధ్య ఏడేళ్లపాటు శృంగార జీవితం లేదని విషయం కూడా ఉండనుందని తెలుస్తోంది. హ్యారీ జన్మించిన తర్వాత వారిద్దరి మధ్య దూరం ఎలా పెరిగిందనే విషయాలు, ఆ తర్వాత ఒకరిపట్ల ఒకరు విద్వేషంగా ఎలా మారారనే విషయాలు కూడా ఇందులో తెలియనున్నాయట. అయితే, వీటిని బహిర్గతం చేయొద్దంటూ ఇప్పటికే రాయల్ కుటుంబంతోపాటు డయానా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మాజీ అధికారులు చెబుతున్నప్పటికీ వాటిని విడుదల చేసేందుకు సదరు టీవీ చానెల్ సిద్ధమైంది.