మళ్లీ వచ్చేసిన 'ఓపెన్ గంగ్నమ్ స్టైల్'..
సై గుర్తున్నాడు కదా? 2012లో 'గంగ్నమ్ స్టైల్' పాటతో ప్రపంచవ్యాప్తంగా సునామీ సృష్టించిన ఈ కొరియన్ పాప్ సూపర్‌స్టార్ మరోసారి తనదైన డాన్సింగ్ స్టెపులతో ముంచెత్తాడు. తాజాగా అతను రూపొందించిన 'డాడీ' పాట.. యూట్యూబ్‌లో విశేషంగా ఆకట్టుకుంటోంది. సై మార్కు డాన్సులతో కొంత విచిత్రంగా, మరికొంత వినూత్నంగా ఉన్న 'డాడీ' పాటను యూట్యూబ్‌లో 24 గంటల్లోనే 42లక్షలమందికిపైగా వీక్షించారు.
విలియమ్ తీసిన 'ఐ గాట్ ఇట్ ఫ్రమ్ మై మమ్మ' పాటకు 'మేల్' వెర్షన్‌గా సై 'డాడీ' పాటను రూపొందించాడు. ఇందులో సై శిశువుగా, స్కూల్ విద్యార్థిగా, సల్సా డ్యాన్సర్‌గా వినూత్న అవతారాల్లో యానిమేటెడ్ లుక్‌తో కనిపిస్తాడు. ప్రసవ సన్నివేశంతో ఈ పాట ప్రారంభమవుతుంది. సంగీతం మొదలవ్వడంతో సై ముఖంతో కూడిన ఓ శిశువు జన్మిస్తాడు. దాంతో 'ఐ గాట్ ఇట్ ఫ్రమ్ డ్యాడీ' పాట మొదలవుతుంది. ఈ శిశువు పెద్దవాడై తన డ్యాన్స్ స్టెప్పులతో స్కూల్ విద్యార్థినులను, టీచర్‌ను, అమ్మాయిలను ఎలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటాడు అనే థీమ్‌తో పాట సాగుతుంది. అంతేకాకుండా ఇందులో సై బాలుడిగా, తండ్రిగా, తాతగా త్రిపాత్రభినయంతో స్టెప్పులు వేసి ఉర్రూతలూగిస్తాడు.
సై తీసిన డ్యాన్సింగ్ థ్రిల్లర్ 'గంగ్నమ్ స్టైల్'ను యూట్యూబ్‌లో 2.46 కోట్లమంది వీక్షించారు. పాప్ చరిత్రలోనే భారీ హిట్లలో ఒకటిగా నిలిచింది ఈ పాట. ఆ తర్వాత సై తీసిన పాప్ సాంగ్ కావడంతో సహజంగానే 'డ్యాడీ'కి కూడా భారీగానే హిట్లు వస్తున్నాయి. అయితే ఇది కూడా 'గాంగ్నమ్ స్టైల్' స్థాయిలో రికార్డులు సృష్టిస్తుందా? అనేది వేచి చూడాలి.