పుతిన్‌కు ఫస్ట్ ర్యాంక్, మోదీకి 9వ ర్యాంక్!
పుతిన్‌కు ఫస్ట్ ర్యాంక్, మోదీకి 9వ ర్యాంక్!
Published Thu, Dec 15 2016 9:44 AM | Last Updated on Thu, Oct 4 2018 4:43 PM
ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల జాబితాలో ప్రధాని నరేంద్రమోదీ టాప్ 10 ర్యాంకులలో స్థానం సంపాదించారు. ఆయన తొమ్మిదో స్థానంలో నిలవగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వరుసగా నాలుగో సంవత్సరం కూడా మొదటి స్థానంలోనే ఉన్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు రెండోర్యాంకు వచ్చింది. ఫోర్బ్స్ పత్రిక మొత్తం 74 మందితో కూడిన ఈ జాబితాను విడుదల చేసింది. 130 కోట్ల మంది భారతీయులలో భారత ప్రధాని నరేంద్రమోదీకి బ్రహ్మాండమైన పాపులారిటీ ఉందని ఫోర్బ్స్ పత్రిక ప్రత్యేకంగా పేర్కొంది. వాతావరణ మార్పులు, భూతాపం లాంటి అంశాల్లో మోదీ చాలా క్రియాశీలకంగా వ్యవహరించారని, తర్వాత పరిణామాల్లో ఆయన ప్రపంచస్థాయి నేతగా ఎదిగారని తెలిపింది. అవినీతి, మనీలాండరింగ్‌లను తగ్గించడానికి గత నెలలో పెద్దనోట్లను రద్దుచేస్తూ అనూహ్య ప్రకటన చేయడాన్ని కూడా ఆ పత్రిక ప్రస్తావించింది.
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా 48వ స్థానంలో నిలిచారు. జర్మనీ చాన్స్‌లర్ మెర్కల్ మూడవ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ నాల్గవ, పోప్ ఫ్రాన్సిస్ ఐదో స్థానాల్లో ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ 7, ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ 10, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ 23, యాపిల్ సీఈవో టిమ్ కుక్ 32, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 43, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 51వ, ఐసిస్ ఉగ్రనేత అబుబకర్ అల్ బాగ్దాదీ 57వ ర్యాంక్ పొందారు.
Advertisement