ఖతర్ అష్టదిగ్బంధం
► సంబంధాలు తెంచుకున్న పొరుగు దేశాలు
► ఆహార కొరత ముంగిట ఖతర్
► మూడో వంతు జనాభా భారతీయులే
► ఆందోళనలో వలస కార్మికులు
నిత్యం రాజకీయ అస్థిరత తాండవించే పశ్చిమాసియాలో ఖతర్ కేంద్రంగా మరో సంక్షోభం ముదురుతోంది. హైదరాబాద్ నగరానికి రెండింతలుండే ఈ దేశంలో ఎక్కువ జనాభా భారతీయులే. ప్రపంచంలోనే అత్య ధిక తలసరి ఆదాయం(రూ.84.3 లక్షలు) గల ఈ దేశంతో సౌదీ, యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్టు దేశాలు దౌత్య సంబంధాల్ని తెంచు కున్నాయి. జిహాదీ, ఉగ్రవాద సంస్థలకు ఖత ర్ మద్దతిస్తుందని ఆరోపిస్తూ ఆ దేశంతో భూ, జల, వాయుమార్గాల్ని మూసివేశాయి. పొరు గుదేశాల సహాయనిరాకరణతో ఆహారం, నిత్యావసరాల కోసం ఇప్పుడు ఖతర్ విలవిలలాడుతోంది.
ఎందుకీ సంక్షోభం..
ఖతర్.. ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తూ మద్దతు ఇస్తోందనే ప్రధాన ఆరోపణతో జూన్ 5న పొరుగు దేశాలు దౌత్య సంబంధాల్ని తెంచుకోవడంతో పాటు తమ దేశాల్లోని ఖతర్ పౌరులు 14 రోజుల్లో దేశం విడిచి వెళ్లాలనీ అల్టిమేటం జారీచేశాయి. ఈ నేపథ్యంలో ఖతర్‌లో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఆ దేశానికి అవసర మయ్యే ఆహారంలో దాదాపు 40 శాతం సర ఫరా అవుతున్న ఏకైక భూసరిహద్దు మార్గాన్ని సౌదీ మూసివేసింది.
ఆహార కొరత భయంతో ప్రజలు మార్కెట్లకు వెల్లువెత్తుతున్నారు. చాలా విమానయాన సంస్థలు దోహా నుంచి విమానాల రాకపోకలను రద్దు చేశాయి. తమ గగనతలంలో ఖతర్ విమాన రాకపోకల్ని పొరుగు దేశాలు నిషేధించడంతో విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ప్రపంచ చమురు మార్కెట్లపై ప్రభావం పడుతోంది. యెమెన్, మాల్దీవులు, లిబియా ప్రభుత్వాలు కూడా ఖతర్‌తో సంబంధాలు తెంచుకున్నాయి. ప్రస్తుతం ఇరాన్, కువైట్, రష్యాలు అండగా నిలిచాయి.
ఉగ్రవాదానికి సాయం నిజమేనా..?
ఖతర్, పొరుగు దేశాలకు.. చాలా కాలంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కొన్ని గల్ఫ్ దేశాలు ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన ‘ముస్లిం బ్రదర్‌హుడ్’ సహా పలు ప్రాంతీయ ఇస్లామిక్ గ్రూపులకు ఖతర్ మద్దతివ్వడం పొరుగు దేశాల ఆగ్రహానికి కారణమైంది. షియా ప్రాబల్యమున్న ఇరాన్‌తో ఖతర్ సన్నిహిత సంబంధం.. సున్నీ ఆధిక్య సౌదీ అరేబియాకు కోపం తెప్పిస్తోంది. ఇరాన్ విషయంలో అమెరికా శత్రుపూర్వకంగా వ్యవహరిస్తోందని, ప్రాంతీయ సుస్థిరత నెలకొల్పడంలో ఇరాన్ పెద్ద శక్తిగా పేర్కొంటూ ఖతర్ ప్రభుత్వ వార్తా సంస్థ వెబ్‌సైట్‌లో గతనెల్లో ఒక కథనం ప్రచురి తమైంది.
ఆ కథనం హ్యాకర్ల పనని ఖతర్ పాలకులు పేర్కొన్నా.. పొరుగు దేశాలు మాత్రం శాంతించలేదు. నిజానికి ఐసిస్ పోరాటానికి అమెరికా సారథ్యంలోని సంకీర్ణంలో ఖతర్ కూడా భాగస్వామి. అయితే ఐసిస్‌కు ఖతర్ ఆర్థిక సాయం చేస్తోందని ఇరాక్‌లోని షియా నాయకుల ఆరోపణ. అల్‌కాయిదాతో సంబంధాలున్న హయత్ తాహ్రిర్ అల్‌షామ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణల్ని తోసిపుచ్చింది. అఫ్గాన్ తాలిబాన్ ఖతర్ రాజధాని దోహాలో ఉండటం గమనార్హం.
మూడోవంతు భారతీయులే..
ప్రపంచంలో మూడో అతి పెద్ద సహజవాయువు నిక్షేపాలు, చమురు నిల్వలున్న ఖతర్ విస్తీర్ణం 11,586 చదరపు కిలోమీటర్లు. 2003లో జనాభా ఏడు లక్షలు కాగా.. ప్రస్తుతం 25 లక్షలు.. 2022 ఫిఫా ప్రపంచకప్ పోటీల కోసం స్టేడియాలు, ఇతర నిర్మాణ పనులు పెద్ద ఎత్తున సాగుతుండడంతో భారత్, ఇతర దేశాల నుంచి భారీగా వలసలు చోటుచేసుకు న్నాయి.
జనాభాలో 12 శాతం ఖతర్ పౌరులు కాగా.. మూడో వంతు(6.5 లక్షలు) భారతీ యులే. మతపరంగా ముస్లింలు, క్రైస్తవుల తర్వాత మూడో స్థానంలో హిందువులే ఉన్నారు. ఉపాధి అవకాశాలు అధికంగా ఉన్నా పని పరిస్థితులు దారుణంగా ఉన్నాయని.. చాలా మం ది కార్మికులు ఇంకా శిబిరాల్లోనే దుర్భర పరిస్థితుల్లోవున్నారని పలు అంతర్జాతీయ సంస్థల అధ్యయనాలు వెల్లడించాయి. కార్మికులు దోపిడీకి గురవుతున్నారని అవి పేర్కొన్నాయి.
ఖతర్‌కు అండగా ఇరాన్
5 విమానాలు, 3 నౌకల్లో ఆహారపదార్థాల సరఫరా
టెహరాన్: ఖతర్‌ను ఆదుకునేందుకు ఇరాన్ రంగంలోకి దిగింది. ఆహారపదార్థాలతో కూడిన ఐదు విమానాలను ఖతర్‌కు పంపింది. పండ్లు, కూరగాయలు వంటి నిత్యావసరాల్ని ఖతర్‌కు పంపామని, ఒక్కో విమానంలో 90 టన్నుల ఆహారపదార్థాల్ని తరలించినట్లు ఇరాన్ జాతీయ విమానయాన సంస్థ తెలిపింది. అవసరమైన మేరకు సరఫరా కొనసాగిస్తామని వెల్లడిం చింది. మరోవైపు 350 టన్నులతో కూడిన ఆహారపదార్థాలతో మూడు నౌకలు ఇప్పటికే ఖతర్‌కు బయల్దేరాయి. కాగా మానవతా దృక్పథంతో కొందరు ఖతర్ దేశస్తుల్ని తమ దేశంలో ఉండేందుకు బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈలు అనుమతించాయి.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్