
అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ: ఒబామా
జాక్సన్ విల్లే: అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. డెమొక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటీ గట్టిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ బాగా పుంజుకున్నారని సర్వేలు వెల్లడించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు పోలయ్యేలా చూడాలని మద్దతుదారులకు ఒబామా సూచించారు. అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన ఫ్లోరిడాలో ఆయన గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జాక్సన్ విల్లేలో మద్దతుదారులకు ఉద్దేశించి ప్రసంగించారు.
'అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ తప్పదు. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికల్లో మనం గెలవకపోతే గత ఎనిమిదేళ్లలో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి అంతా నిరూపయోగమవుతుంది. వచ్చే ఐదు రోజులు మనసుపెట్టి పనిచేయండి. ఈ ఎన్నికలపైనే మన భవిష్యత్ ఆధారపడివుందని గుర్తుంచుకోవాల'ని ఒబామా అన్నారు. శ్వేతసౌధంలో అడుగుపెట్టే అర్హత ట్రంప్ కు లేదని ఆయన పునరుద్ఘాటించారు. హిల్లరీని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.