రాఖీ.. వారి కష్టాలను రెట్టింపు చేస్తుంది!
జైసల్మేర్ : రక్షా బంధన్ పండుగ వచ్చిందంటే చాలు.. అక్కాతమ్ముడు, అన్నాచెల్లెళ్లు చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ, రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలోని బిల్ తెగ వారి పరిస్థితి మరోలా ఉంది. రాఖీ వచ్చిందంటే చాలు వారి ఆనందం ఆవిరయిపోయి.. ఓ విషాధంగా ఉంటుంది. గత కొన్నేళ్లలో పాకిస్తాన్ నుంచి భారత్కు వలసలు ఎక్కువగా ఉన్నాయి. మరికొందరికి పెళ్లిళ్ల తర్వాత వారి కుటుంబాలకు దూరం కావాల్సిన దుస్థితి తలెత్తింది. భారత్-పాక్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుదన్న విషయం అందరికి విదితమే. వివరాల్లోకి వెళితే.. లాచో దేవి అనే మహిళ జైసల్మేర్ కు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఐదేళ్లయింది. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా తన సోదరులకు ఆమె రాఖీ కట్టలేకపోయింది. కారణం.. ఆమె సోదరులు, వారి కుటుంబాలు పాక్ లో ఉంటున్నాయి. వీసాలేని కారణంగా ఆమె అక్కడికి వెళ్లలేకపోతోంది.
వీసా పొందడం చాలా కష్టంగా ఉన్నందువల్లే తన సోదరులను కలుసుకోలేక పోతున్నానంటూ రక్షా బంధన్ పండుగ నాడు కన్నీరుమున్నీరయింది. తమకు రక్షా బంధన్ రోజైనా సోదరులను, సోదరిలను కలుసుకునే అవకాశాలను ప్రభుత్వం కల్పించాలని గీనా రామ్ ప్రాధేయపడ్డారు. ఇరు దేశాల్లోనూ ఇదే పరిస్థితి ఉందని, ఇందులో చాలా మార్పులు రావాలని బిల్ వర్గం నాయకుడు నాథూరామ్ అన్నారు.వీసా లేకపోవడంతో సరిహద్దులే.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధాల మధ్య హద్దులను ఏర్పాటు చేస్తున్నాయని పేర్కొన్నారు. మా వర్గానికి చెందిన చాలా కుటుంబాల పరిస్థితి ఇలాగే ఉందని ఆయన వాపోయారు. రాఖీ పండుగ వచ్చిందంటే వారి బాధలు, కష్టాలు రెట్టింపవుతాయి.