తాలిబన్ల తన్నులాట.. ఏర్పడిన చీలిక!
కాబుల్: అఫ్గనిస్థాన్ తాలిబన్ల మధ్య చీలిక ఏర్పడింది. రెండు వర్గాలుగా విడిపోయింది. తాలిబన్ ఫైటర్స్, స్ప్లింటర్ గ్రూపులుగా వేరుపడి ఇప్పుడు తమకు కొత్త నాయకుడి సారథ్యాన్ని కోరుకుంటున్నట్లు కీలక వర్గాల సమాచారం. వీరి మధ్య తన్నులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. టాప్ పొజిషన్లో ఉన్న తాలిబన్ నేతల మధ్య ఈ తరహా గొడవలు జరగడం ఇప్పుడు కొత్త చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న తాలిబన్ల నేత ముల్లా అక్తర్ మహ్మద్ మన్సూర్తో పలువురు తాలిబన్లకు విభేదాలు వచ్చాయంట.
ముల్లా మహ్మద్ ఒమర్ స్థానంలో వచ్చిన ఆయన సమర్థుడు కాదని, అతడి స్థానంలో తాము ఒమర్ దగ్గరి సన్నిహితుడు ముల్లా మహ్మద్ రసోల్ను మాత్రమే సమర్థిస్తామని వాదులాడినట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల మధ్య పోట్లాటకూడా నెలకొందని తాలిబన్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే నిజమైతే వారిలో వారికి ఘర్షణలు ఏర్పడి ఫలితంగా ప్రభుత్వ బలగాలకు తమ దేశంలో ఉగ్రవాదులను అణిచివేయడంలోగానీ, లేదా కొత్త తాలిబన్ నేత సముచితమైన చర్చలు జరపడంగానీ చేసే అవకాశం ఉందని మీడియా వర్గాల సమాచారం. మరోపక్క, నేటి ప్రభుత్వానికి సహకరించేలా ప్రస్తుత తాలిబన్ చీఫ్ మన్సూర్ వ్యవహరిస్తున్నారని, శాంతియుత చర్చలకు సముఖుత వ్యక్తం చేస్తున్నారని, ఈ నేపథ్యంలోనే తాలిబన్లు, ప్రభుత్వానికి మధ్య జరిగే శాంతిఒప్పందాలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఈ చీలిక ఏర్పరిచినట్లు తెలుస్తోంది.