కారకస్: వెనిజులాలోని జైల్లో మరోసారి తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. సెంట్రల్ నగరంలోని వాలెన్సియాలోని జైలునుంచి తప్పించుకునేందుకు ఖైదీలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా జైలుకు నిప్పు పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో అగ్ని ప్రమాదంలో 68 మంది మృతి చెందారు. దీనిపై చీఫ్ ప్రాసిక్యూటర్ తారెక్ విలియం సాబ్ ట్విటర్‌లో సమాచారం అందించారు. బాధాకరమైన సంఘటన అంటూ బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు.
కరోబోబో రాష్ట్రంలో నిర్బంధ కేంద్రంలోని జైళ్లలో నమోదువుతున్న ఘోరమైన సంఘటనలకు తాజా ఉదంతమిది. బుధవారం చెలరేగిన ఘర్షణల సందర్భంగా ఎంతమంది చనిపోయిందీ పూర్తి స్పష్టత లేనప్పటికీ.. ప్రాథమికంగా 68మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక వర్గాల సమాచారం. ఒక పోలీసు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
మరోవైపు సరైన సమాచారాన్ని అధికారులు అందించడలేదంటూ జైలు బయట ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై భాష్ప వాయువు ప్రయోగించి పరిస్థిని అదుపు చేశారు. మృతులకు సంబంధించిన వివరాలను ఫోరెన్సిక్ వైద్యులు అంచనా వేస్తున్నారని , త్వరలోనే పూర్తి వివరాలను అధికారులు ప్రకటించారు. సమగ్ర దర్యాప్తునకు హామీ ఇచ్చారు. కాగా వెనిజులాలోని జైళ్లలో అధ్వాన్నమైన పరిస్థితుల నేపథ్యంలో జైళ్లలో ఘర్షణలు, హత్యలు సర్వసాధారణం. గతంలో జైళ్లలో పెద్ద ఎత్తున చెలరేగిన ఘర్షణల్లో డజన్ల కొద్దీ ఖైదీలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment