మితిమీరి మంచి నీళ్లు తాగినా ముప్పే!
న్యూయార్క్: నీళ్లు ఎంత ఎక్కువ తాగితే ఆరోగ్యానికి అంత మంచిదని భావిస్తారు చాలా మంది. కానీ ఇలా అతిగా నీళ్లు తాగటం కూడా ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లయోలా యూనివర్సిటీ మెడికల్ సెంటర్‌కు చెందిన అంతర్జాతీయ నిపుణుల బృందం సూచనల ప్రకారం దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తాగాలి. అవసరం లేకున్నా అధికంగా నీళ్లు తాగకూడదు. సాధారణంగా మనం తాగే నీటిని మూత్ర పిండాలు వడపోస్తాయి. నీటిలోని వ్యర్థ పదార్థాల్ని మూత్రం రూపంలో బయటకు పంపేస్తాయి. ఇలా మూత్ర పిండాలకు కూడా ఒక స్థాయిలో పని చేయగలిగే శక్తి ఉంటుంది.
కానీ అవసరానికి మించి నీళ్లను తాగడం వల్ల వాటిని మూత్ర పిండాలు వడపోయలేవు. ఎక్కువ నీటిని వడపోసే క్రమంలో మూత్ర పిండాలపై ఒత్తిడి పెరిగి, అవి వాపునకు గురవుతాయి. శరీరంలో సోడియం స్థాయి తగ్గిపోతుంది. ఫలితంగా అనేక కణజాలాలు ఉబ్బిపోయి ప్రాణానికే హాని కలగవచ్చు. ముఖ్యంగా క్రీడాకారుల్లో ఈ సమస్య ఎక్కువ తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే వారు గేమ్స్ ప్రాక్టీస్ చేసే సమయంలో అవసరం లేకున్నా అతిగా నీళ్లు తాగుతారు. ఇది ఎక్సర్‌సైజ్ అసోసియేటెడ్ హైపోనాట్రీమియా (ఈఏహచ్)కు దారి తీస్తుంది. తల తిరగడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు ఈఏహచ్‌కు సూచనలు.
నీళ్లు తాగడం వల్ల అలసటను అధిగమించొచ్చని క్రీడాకారులు భావిస్తారు. చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేసేందుకు, ఆట ఆడే సమయంలో ఇతర సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కూడా నీటిని తీసుకుంటారు. దీని వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సహజ సిద్ధంగా దాహం వేసినప్పుడు మాత్రమే నీటిని తీసుకోవాలని, ఇది క్రీడాకారుల ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెబుతున్నారు.