రోవర్లలో మేటి... ఆపర్చునిటీ!
అరుణగ్రహంపై పదేళ్లుగా అలుపెరగకుండా తిరుగుతున్న నాసా ఆపర్చునిటీ శోధక నౌక(రోవర్) అరుదైన రికార్డు సృష్టించింది. 2004లో అంగారకుడిపై వాలిన ఈ శోధక నౌక ఆదివారం 40 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందట. దీంతో భూమి కాకుండా ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రోవర్‌గా ఇది చరిత్రకెక్కింది. అయితే మూడు నెలల కాలంలో ఒక కిలోమీటరు దూరం మాత్రమే తిరిగి భూమికి సమాచారాన్ని పంపేందుకే దీనిని తయారు చేశారు. కానీ.. పదేళ్లు పూర్తయినా ఇంకా ఇది చకచకా పరుగులు పెడుతోంది. మార్స్‌పై ఈగల్ క్రేటర్ ప్రాంతంలో దిగి ఇప్పటిదాకా 40.25 కిలోమీటర్లు ప్రయాణించిన ఆపర్చునిటీ మరో రెండు కిలోమీటర్లు ప్రయాణిస్తే కీలకమైన ఎండీవర్ క్రేటర్ ప్రాంతానికి చేరుకోనుందట.
అంగారకుడిపై మట్టి, శిలల గురించిన సమాచారాన్ని, గతంలో నీటి ప్రవాహపు ఆనవాళ్లను, ఖగోళం, వాతావరణ వివరాలను కూడా ఈ రోవర్ అందించింది. అన్నట్టూ.. ఇతర గ్రహాలపై అత్యధిక దూరం ప్రయాణించిన రికార్డు ఇంతకుముందు సోవియెట్ యూనియన్ పంపిన లూనోఖోడ్-2 రోవర్ మీద ఉంది. లూనోఖోడ్-2 రోవర్ చంద్రుడిపై 1973, జనవరిలో దిగి.. ఐదు నెలల్లోనే 39 కిలోమీటర్లు ప్రయాణించింది. తర్వాత అదే ఏడాది మే నెలలో చివరిసారిగా సమాచారం పంపి.. శాశ్వతంగా మూగబోయింది.