ఆలస్యం.. అమృతం..!
‘‘ఎప్పటికీ జరగకపోవడం కంటే.. ఆలస్యంగానైనా జరగడమే మేలు..’’ అని ఓ ఇంగ్లిష్ సామెత. ఎవరు మననం చేసుకున్నా చేసుకోకపోయినా.. అమెరికాకు చెందిన ఉపాధ్యాయుడు రస్సెల్ క్రిస్టోఫ్ మాత్రం పదే పదే ఈ మాటను వల్లె వేస్తుంటాడు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిన పనేమీ లేదు.. అతడి కథేంటో తెలుసుకుంటే అతడి వేదాంతానికి అర్థమూ మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు కూడా అంటారు.. ‘బెటర్ లేట్ దేన్ నెవర్’ అని!
1986లో సరదాగా ఓసారి ఫొటో స్టుడియోకు వెళ్లాడు క్రిస్టోఫ్. నార్తన్ కాలిఫోర్నియాలో చక్కగా ఫోటో షూట్ చేయించుకుని ఆ ఫొటోలు పట్టుకుని ఇంటికి వెళ్లిపోయాడు. నవ్వుతున్నట్టు, ఛాతీ విరుచుకుని, నిటారుగా నిల్చుని.. ఇలా రకరకాల భంగిమల్లో ఫొటోలు దిగాడు. వాటన్నిటినీ చూసుకుని మురిసిపోయాడు. వాటిలో ఒక ఫొటో అతడికి బాగా నచ్చింది. కాఫీ కప్పును పెదాలపై ఉంచి, ఆ సువాసనను ఆస్వాదిస్తున్నట్టుగా ఉందా చిత్రం. రోజులు గడుస్తున్నాయి. నెలలు, ఏళ్లు.. ఇలా కాలం పరుగులెడుతూనే ఉంది. కానీ, క్రిస్టోఫ్‌కు ఆ చిత్రాలపై మమకారం మాత్రం తగ్గలేదు. అవి అతడికి మధుర జ్ఞాపకాలుగా మారిపోయాయి. అవే అతడికి లక్షలు.. కోట్లు!
2003లో ఓ రోజు షాపింగ్‌కు వెళ్లాడు క్రిస్టోఫ్. ఇంటికి కావాల్సినవి అన్నీ కొన్నాడు. అందులో నెస్లీ కంపెనీకి చెందిన ‘టేస్టర్స్ చాయిస్’ ఇన్ స్టంట్ కాఫీ కూడా ఉంది. ఆ కాఫీ కవర్‌పై ఓ యువకుడు కాఫీని ఆస్వాదిస్తున్న చిత్రం ఉంది. అది చూడగానే ఎంతో ఉద్వేగంగా ఫీలయ్యాడు క్రిస్టోఫ్. తాను అప్పుడెప్పుడో ముచ్చటపడి తీసుకున్న చిత్రంలానే అది ఉందనుకున్నాడు. మరింత గమనించి చూస్తే అది తన చిత్రమేనని అతనికి అర్థమైంది. వెంటనే ఆ కాఫీ కవర్‌పై పరిశోధనలు మొదలుపెట్టాడు. 1997 నుంచి 2003 వరకూ దాదాపు ఆరు దేశాల్లో అదే కవర్‌తో నెస్లీ సంస్థ కాఫీలను అమ్ముతోందని గుర్తించాడు.
ఇక, ఆగలేదు. నెస్లీ తన చిత్రాన్ని ప్రచారానికి వాడుకున్నందుకుగానూ పరిహారాన్ని కోరాలనుకున్నాడు. కానీ, ఎందుకో ధైర్యం సరిపోలేదు. తాను ఓడిపోతానని భావించాడు. అయితే, స్నేహితులు ధైర్యం నూరిపోయడంతో నెస్లీపై దావా వేశాడు. కేసు విచారణ సాగిన తర్వాత న్యాయస్థానం క్రిస్టోఫ్ చెవిలో తేనె పోసింది. ఏళ్లపాటు ఎలాంటి పారితోషికమూ చెల్లించకుండా లాభాలు గడించినందుకు నెస్లే సంస్థకు గట్టిగానే షాకిచ్చింది. ఏకంగా 15.6 మిలియన్ డాలర్లను క్రిస్టోఫ్‌కు చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ మొత్తంలో ఒక్కసారిగా కోటీశ్వరుల జాబితాలో చేరిపోయాడు రస్సెల్ క్రిస్టోఫ్. ఈ మొత్తం మన కరెన్సీలో వంద కోట్ల రూపాయల పైమాటే! ఇప్పుడు చెప్పండి.. ఆయన ‘బెటర్ లేట్ దేన్..’ మాటను పదే పదే వల్లె వేయడం కరెక్టో కాదో..!!
- (సాక్షి స్కూల్ ఎడిషన్)