
సమంత బీ.. పక్కన ఇవాంక ట్రంప్(కుడి)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీవీ యాంకర్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. కమెడియన్ కమ్ టీవీ హోస్ట్ సమంత బీ, ‘ఫుల్ ఫ్రొంటల్’ అనే షోలో ఇవాంకపై తీవ్ర వ్యాఖ్యలు చేయగా, అది దుమారం రేపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా, మరోవైపు వైట్‌హౌజ్ కూడా స్పందించింది. ఈ నేపథ్యంలో ఆమె ఇవాంకకు సారీ చెప్పేశారు.
‘ఇవాంక ట్రంప్, ఆ కార్యక్రమం చూసిన ప్రేక్షకులకు నా క్షమాపణలు. ఆమెపై గత రాత్రి నేను అలాంటి వ్యాఖ్యలు చేయాల్సింది కాదు. అనవసరంగా మాట్లాడాను. హద్దులు మీరాను. అందుకు చింతిస్తున్నా. ఇవాంక నన్ను మన్నించండి’ అని ఓ ప్రకటనలో సమంత తెలిపారు. తన ట్విటర్‌లో ఆమె ట్వీట్ కూడా చేశారు. కాగా, ఈ మధ్యే ఇవాంక తన చిన్న కొడుకుతో దిగిన ఓ ఫోటోను ట్వీట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో అమెరికాలో 1500 మంది వలసవాద చిన్నారులు అదృశ్యం అయ్యారన్న నివేదిక ఒకటి వెలువడింది. బుధవారం తన టీవీ షోలో సమంత బీ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ... యూఎస్ ప్రభుత్వం, అధ్యక్షుడు ట్రంప్ వలసవాదుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారంటూ పేర్కొన్నారు.
తన తండ్రికి(ట్రంప్) సలహాలు ఇవ్వాలంటూ ఇవాంకకు సూచిస్తూ కొడుకుతో ఉన్న ఫోటో ప్రస్తావనకు తెచ్చి మరీ సమంత అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాంటి పరిస్థితి మీకు వస్తే తెలుస్తుందంటూ కామెంట్లు చేశారు. దీనిపై వైట్‌హౌజ్ ప్రెస్ కార్యదర్శి సారా హుక్కాబీ సాండర్స్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. సమంత చేసిన వ్యాఖ్యలు సరైంది కాదని పేర్కొన్నారు. మరోవైపు పలువురిని నుంచి విమర్శలు రావటంతో సమంత క్షమాపణలు చెప్పారు. మరోవైపు టీబీఎస్ నెట్‌వర్క్ ఆ కార్యక్రమం తాలూకూ వీడియోలను తొలగిస్తున్నట్లు చెబుతూ వైట్‌హౌజ్ కార్యాలయాన్ని క్షమాపణలు కోరింది.
Comments
Please login to add a commentAdd a comment