సాక్షి, న్యూఢిల్లీ: అమెరికన్లకే ఉద్యోగాలంటూ ట్రంప్ అనుసరించిన బాటలోనే సౌదీ అరేబియా పయనిస్తోంది. తాజాగా తమ పౌరులకే కంపెనీలు ఉద్యోగాలు కట్టబెట్టేలా ఒత్తిడి పెంచేందుకు, నిరుద్యోగం తగ్గించేందుకు 12 కీలక రంగాల్లో విదేశీయులు పనిచేయడాన్ని సౌదీ నిరోధించింది. ఈ కఠిన విధానాన్ని కార్మిక మంత్రి అలీ బిన్ నసీర్ అల్ ఘపీస్ ఆమోదముద్ర వేశారని ప్రభాత్ ఖబర్ పత్రిక వెల్లడించింది. ఈ పరిణామం సౌదీలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న 1.2 కోట్ల మంది విదేశీయులపై పెనుప్రభావం చూపనుంది.
వీరిలో అత్యధికులు తక్కువ వేతనాలతో కూడి వివిధ వృత్తుల్లో పనిచేసే కార్మికులే కావడం గమనార్హం. సౌదీలో పనిచేసి పొట్టపోసుకుంటున్న 30 లక్షల మందికి పైగా భారతీయులపైనా ఈ ఉత్తర్వులు ప్రభావం చూపనున్నాయి. 12 రంగాల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడాన్ని కార్మిక, సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ దశలవారీగా నియంత్రిస్తుంది.
కారు, మోటార్ బైక్ షోరూమ్‌లు, రెడీమేడ్ క్లాత్ స్టోర్స్, హోం..ఆఫీస్ ఫర్నీచర్ దుకాణాలు, కిచెన్ సామాగ్రి దుకాణాల్లో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి విదేశీ ఉద్యోగులు పనిచేయడంపై నియంత్రణలు అమల్లోకి రానుండగా..నవంబర్ నుంచి వాచీ దుకాణాలు, ఆప్టిక్స్ స్టోర్స్‌లో విదేశీ ఉద్యోగులు పనిచేయడంపై నియంత్రణలు విధిస్తారు. ఇక వచ్చే ఏడాది జనవరి 7 నుంచి వైద్య పరికరాల దుకాణాలు, భవన నిర్మాణ సామాగ్రి దుకాణాలు, ఆటో విడిభాగాల స్టోర్స్, కార్పెట్ దుకాణాలు, స్వీట్ షాపుల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడంపై నియంత్రణలు అమల్లోకి రానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment