పాక్ స్మగ్లర్కు శిరచ్ఛేదం
రియాద్: హెరాయిన్, కొకేయిన్ వంటి మాదకద్రవ్యాలు అక్రమరవాణా చేస్తూ తమ పౌరులను వాటికి బానిసలుగా మార్చుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీకి.. సౌదీ అరేబియా అధికారులు మరణదండనను అమలుచేశారు. పాకిస్థాన్కు చెందిన షా ఫైజల్ అజీమ్ షా అనే స్మగ్లర్ కు శుక్రవారం శిరచ్ఛేదం అమలుచేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. దీంతో ఈ ఏడాది సౌదీలో అమలుచేసిన మరణ శిక్షల సంఖ్య 109కి చేరింది.
పలుమార్లు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడ్డ అజీజ్.. కొద్ది రొజుల కిందట పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో తన నేరాన్ని అంగీకరించడంతో అతనికి మరణశిక్ష ఖరారయింది. అయితే పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా దాదాపు 50 రోజుల పాటు మరణ దండనలకు విరామం ప్రకటించిన సౌదీ అధికారులు.. అజీన్ శిరచ్ఛేదంతో తిరిగి షరియత్ చట్టాల అమలును ప్రారంభించారు.
సౌదీలో నేరాలకు పాల్పడి, మరణదండనకు గురైన వీదేశీయుల సంఖ్య 2014లో 87 శాతం ఉండగా ఈ ఏడాది 125 శాతానికి పెరిగింది. షరియత్ చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల అక్రమరవాణా, అత్యాచారం, హత్య, ఆయుధాలతో దోపిడీ, మతధర్మాలను మీరడం లాంటిచర్యలను తీవ్ర నేరాలుగా పరిగణిస్తారు. ఆయా కేసుల్లో దోషులకు మరణదండన ఖాయం.