కట్న కానుకలకు సీలింగ్..!
అధిక కట్నకానుకలకు, డాబుసరి వివాహ పద్ధతులకు అక్కడి ప్రజలు స్వస్తి పలికారు. కొన్ని గిరిజన తెగల్లో సంప్రదాయంగా వస్తున్న ఓలీ (వరుడు వధువుకు చెల్లించే కట్నం) విషయంలో సీలింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇచ్చి పుచ్చుకోవడంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. నైరుతి సౌదీ అరేబియా జిజాన్ ప్రాంతంలోని గిరిజన జాతుల్లో కొనసాగుతున్న వివాహ సంప్రదాయాల్లో మార్పు చేర్పులతో ఆర్థిక భారాన్ని తగ్గించారు.
అరేబియా గిరిజన సంఘాలు పద్ధతిని మార్చుకున్నాయి. వరుడినుంచి అధిక మొత్తంలో వధువు తల్లిదండ్రులు రాబట్టే కట్న కానుకలను తగ్గించుకున్నాయి. తెగల్లో మొదటిసారి పెళ్ళి చేసుకుంటున్న వధువు.. కాబోయే భర్త నుంచి 50 వేల రూపాయలకు మించి కట్న కానుకలు స్వీకరించ కూడదంటూ ఈ కొత్త ఒప్పందంలో పరిధిని నిర్ణయించారు. అదే ఒకసారి విడాకులు తీసుకొన్నవారు.. విడోలు.. రెండోసారి పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఆ సమయంలో వరుడినుంచీ.. 30 వేలకు మించి స్వీకరించకూడదని నిర్ణయించారు. వరుడికి భారంగా మారిన పెళ్ళిళ్ళు సులభతరం అవుతాయన్న ఉద్దేశ్యంతోనే ఈ కొత్త సద్ధతిని అమల్లోకి తెచ్చామని, అవసరమైతే దుస్తులు, గాజుల కోసం మరో ఐదు వేల రూపాయలు ఇచ్చేందుకు అవకాశం ఉందని ఇక్కడి నాయకులు చెప్తున్నారు.
ఇక్కడి తండాల్లో పెళ్ళి సందర్భంగా జరుపుకునే వేడుకలు కూడ రెండుకు మించి ఉండకూడదని, వాటిని.. నిశ్చితార్థం, వివాహం గా నియంత్రించారు. గిరిజన జాతుల్లో పెళ్ళి వేడుక వివిధ పేర్లతో విలాసవంతంగా జరుగుతుండటం, ఆ ఖర్చును వధువు తరపు బంధువులు... వరుడి వద్దనుంచీ బలవంతంగా వసూలు చేస్తుండటంతో వరుడికి ఆర్థిక భారం పెరిగిపోతోందని... దీన్ని తగ్గించేందుకు ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చినట్లు వారు చెప్తున్నారు. జిజాన్ రీజిన్ లోని దామద్ ప్రాంత గవర్నర్.. మేజ్డ్ బిన్ ఖత్లా... ఈ కొత్త ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు పొందే అవకాశం ఉందంటున్నారు. వరుడి వివాహ వేడుకలో అత్యధిక ఖర్చులను గమనించడంతోనే... అక్కడి గిరిజన సంఘాల నాయకులకు పరిస్థితిని వివరించామని, వారు దానికి అంగీకరించడంతో ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తెచ్చామని ఖాత్లా అంటున్నారు.
అలాగే పెళ్ళి తర్వాత ఎటువంటి వేధింపులు ఉండకూడదని ఈ కొత్త మ్యారేజ్ కాంట్రాక్ట్ లో పొందుపరిచారు. అన్ని రకాలుగా ఖర్చులు తగ్గే ఈ నూతన పద్ధతిని జిజాన్ లోని ఇతర సంఘాల ప్రజలు కూడ అంగీకరించడంతోపాటు... అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.