'చనిపోదామనే అలా చేశాడు'
వాషింగ్టన్: అమెరికా జాతీయ జెండాను కప్పుకొని ఓ వ్యక్తి ...వైట్హౌస్ ఫెన్సింగ్ను దూకిన ఘటన గురువారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు పాల్పడిన జోసెఫ్ ఆంథోనీ క్యాపుటో చనిపోదామని నిర్ణయించుకొనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అమెరికా సీక్రెట్ సర్వీస్ కోర్టుకు తెలిపింది. థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా చనిపోదామని నిర్ణయించుకొని ఫెన్సింగ్ దాటాలని నిర్ణయించుకున్నట్లు క్యాపుటో రాసిన సూసైడ్ నోట్ను కోర్టుకు సమర్పించింది. ఈ విధంగా తన మరణాన్ని ప్రపంచానికి తెలపాలని అతడు భావించినట్లు తెలుస్తోంది.
స్టాన్ఫోర్డ్లోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన క్యాపుటో ఫెన్సింగ్ దాటిన సమయంలో అధ్యక్షుడు ఒబామా వైట్హౌస్లోనే ఉన్నారు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునే సమయంలో క్యాపుటో 'ఐ లవ్ మై కంట్రీ' అంటూ నినాదాలు చేశాడు. అయితే క్యాపిటో మానసిక స్థితి సరిగా లేదని భావించిన కోర్టు అతని మానసిక స్థితిని అంచనా వేయాలని సెయింట్ ఎలిజబెత్ ఆసుపత్రికి పంపింది. నిషిద్ధ ప్రాంతంలోకి అక్రమంగా చొరబడినందుకు కోర్టు అతనికి గరిష్టంగా ఏడాది జైలుశిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.