![School Girl Fill Lip Balm Tube With Cheese For Eating In Class Room - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/20/LIP-BALM.jpg.webp?itok=StM-GiuM)
లిప్ బామ్ ట్యూబ్‌లో నింపిన చీజ్
న్యూయార్క్ : అవసరమే మనకు అన్నీ నేర్పిస్తుందనడానికి ఓ చిరు ఉదాహరణ ఈ సంఘటన. తరగతి గదిలో ఆకలి తీర్చుకోవటానికి ఓ చిన్నారి చేసిన తెలివైన పని ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికాలోని సెయింట్ లూయిస్‌కు చెందిన ఓ తొమ్మిదేళ్ల బాలికకు తరగతి గదిలో ఉండగా తరుచూ ఆకలి వేస్తుండేది. ఏదైనా తిందామంటే టీచర్లు ఏమైనా అంటారేమోనన్న భయం. దీంతో చాలా ఇబ్బంది పడేది. ఇక ఇలా అయితే కుదురదనుకున్న బాలిక ఓ చక్కటి ఉపాయం ఆలోచించింది. వాడిపడేసిన లిప్‌బామ్ ట్యూబ్‌ను తీసుకుని అందులో చీజ్‌ను నింపింది. దాన్ని పాఠశాలకు తీసుకెళ్లి టీచర్ల ముందే లిప్ బామ్ ట్యూబ్‌లోని చీజ్‌ను కొద్దికొద్దిగా తినేది. అది గమనించిన టీచర్లు కూడా లిప్ బామ్ అనుకుని ఊరుకున్నారు.
ఆ బాలిక తల్లి వలరీ స్క్రాంప్ హన్... కూతురు తెలివికి ఆశ్చర్యపోయింది. లిప్ బామ్ ట్యూబ్‌లో నింపిన చీజ్ ఫొటోను బుధవారం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ కామెంట్ పెట్టింది. చిన్నారి తెలివికి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. రెండు రోజుల్లో ఆ పోస్ట్ 52వేల లైకులు సంపాదించటంతో పాటు 6వేల మంది దాన్ని రీట్వీట్ చేశారు. ‘‘ భవిష్యత్తు మొత్తం ఆడవాళ్లదే.. నీ కూతురు 2079లో ఉంది. మనం ఇంకా 2019లో ఉన్నాం.. నువ్వు జీనియస్‌వి పాప’’ అంటూ నెటిజన్లు పొగడ్తలతో బాలికను ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment