చెమటతో చక్కెర వ్యాధిని గుర్తించొచ్చు!
మెల్‌బోర్న్: చెమట ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిని గుర్తించే కొత్త సెన్సర్లను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ధరించడానికి వీలుండే స్పాంజి వంటి కాపర్ ఆధారిత ఈ పదార్థం ద్వారా మధుమేహాన్ని సులువుగా తెలుసుకోవచ్చు. మధుమేహం బారిన పడిన వారు తరచుగా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని తెలుసుకుంటూ ఉండాలి. ఆస్ట్రేలియాలోని ఒల్లంగాంగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పదార్థాన్ని కనిపెట్టారు.
రంధ్రాలతో కూడిన స్పాంజి వంటి ఈ కాపర్ నిర్మాణంతో చాలా తొందరగా, కచ్చితత్వంతో చెమట, కన్నీరు వంటి ద్రవాల ద్వారా రక్తంలోని గ్లూకోజ్‌ను గుర్తించవచ్చు. వాహకత, తక్కువ ఖర్చు, అధిక పనితీరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ సెన్సర్లను బాగా అధ్యయనం చేసినట్లు జపాన్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ యుసుకే యమౌచీ తెలిపారు. గాలికి ప్రభావితం అయినపుడు కాపర్ త్వరగా ఆక్సీకరణ చెందే స్వభావం ఉండటం వల్ల వస్త్రం వంటి పదార్థంగా తయారు చేయడం కష్టమని వివరించారు.
కాపర్ ద్రవాన్ని పాలీ సై్టరీన్‌తో కలిపి చిన్న చిన్న పాలీసై్టరీన్ బంతులను తయారుచేసి బయటి నుంచి కాపర్‌ను పోతగా పోశారని తెలిపారు. ఆ తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ విధానాన్ని ఉపయోగించి అందులోని పాలీసై్టరీన్ కరిగిపోయేలా చేశారు. దీంతో ఆ బంతుల్లో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడ్డాయి. ఇవి మానవ వెంట్రుక మందం కన్నా 10 వేల రెట్లు చిన్నగా ఉంటాయి.