
ఎట్టకేలకు ఆమర్ షేకర్ విడుదలయ్యాడు...
అతడి పేరు... షేకర్ ఆమర్... అమెరికా ఖాకీల కర్కశత్వానికి బలై.. ఖైదీల పాలిట నరకంగా పేరున్న గ్వాంటనామో బే జైల్లో పదమూడేళ్ళుగా మగ్గిపోతున్న చివరి బ్రిటిష్ పౌరుడు. ఎట్టకేలకు విడుదలై.. లండన్ చేరుకున్నాడు. అతడు చేసిన నేరమేమిటో కూడ చెప్పకుండా 2001 లో అతడ్నిబంధించారు. అయితే ప్రస్తుతం అతడి విడుదల తర్వాత ఏమిటి అన్నవిషయంపై ఎటువంటి ప్రత్యేక ప్రణాళికలు లేవని 'డౌనింగ్ స్ట్రీట్' అంటోంది.
సౌదీ జాతీయులైన ఆమర్ కుటుంబం లండన్ లో నివసిస్తోంది. అతడి భార్య బ్రిటిష్ కు చెందినది కావడంతో ఆమర్ లండన్ లో నివసించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవని యూకె ప్రధాని డేవిడ్ కామెరాన్ అన్నారు. ఆమర్ విడుదలను ఆయన స్వాగతించారు. ఆమర్ కు నలుగురు పిల్లలు. లండన్ బిగ్గిన్ హిల్స్ విమానాశ్రయానికి చేరిన ఆమర్ కు ప్రస్తుతం 48 ఏళ్ళ వయసు. అతని ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అతడికోసం అంబులెన్స్ ను విమానాశ్రయానికి పంపించారు. అతడ్ని కలిసేందుకు వచ్చిన ఆమర్ మామ.. సయీద్ సిద్ధిక్... ఆమర్ విడుదల అద్భుతమన్నారు. నిజంగా మిరాకిల్ అని అభిప్రాయ పడ్డారు.