ల్యాండ్ మైన్ ఉంటే.. ‘షూ’ పెడుతుంది
మందుపాతరలతో ఏటా ఎంతోమంది చనిపోతున్నారు. మన వద్దా ఎంతో మంది భద్రత సిబ్బంది మృత్యువాత పడుతున్నారు. చిత్రంలో కనిపిస్తున్న సరికొత్త టెక్నాలజీ మైన్స్ నుంచి వారిని రక్షించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మందుపాతరలను కనిపెట్టే పరికరాలు ఎన్నో ఉన్నాయి. అయితే.. ఇది వాటన్నిటికంటే భిన్నమైనది. ఇక్కడ మైన్ డిటెక్టర్ షూలోనే ఉంటుంది. అంటే.. మందుపాతరపై అడుగేయకుండా మనల్ని ముందే హెచ్చరిస్తుందన్నమాట. షూలో కాయిల్, మైక్రోప్రాసెసర్, రేడియో ట్రాన్స్‌మిటర్ ఉంటాయి. కాయిల్ విద్యుత్ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. కూంబింగ్‌లో భాగంగా భద్రత సిబ్బంది ఈ షూలను వేసుకుని నడిస్తే.. వారికి 2 మీటర్ల పరిధిలో మందుపాతర ఏదైనా ఉంటే.. విద్యుత్ అయస్కాంత క్షేత్రానికి అవరోధం కలుగుతుంది. దీన్ని మైక్రోప్రాసెసర్ గుర్తించి.. రేడియో ట్రాన్స్‌మిటర్ ద్వారా భద్రతా సిబ్బంది చేతికి ధరించే వాచీ వంటి పరికరానికి సంకేతమందిస్తుంది. వెంటనే అలారం మోగి.. మందుపాతర ఎక్కడుందన్న విషయం వాచీపై ప్రదర్శితమవుతుంది.
కొలంబియాకు చెందిన లెముర్ స్టూడియో డిజైన్ సంస్థ దీని రూపకర్త. ఆర్థికపరమైన కారణాల వల్ల ‘సేవ్ వన్ లైఫ్’ అనే ఈ వ్యవస్థ ప్రస్తుతం డిజైన్ దశలోనే ఉంది. ఆర్థిక సమస్యలను అధిగమించి.. త్వరలోనే దీని ఉత్పత్తిని చేపడతామని సదరు సంస్థ చెబుతోంది.