అమెరికా దాష్టీకం!
సాన్ ఫ్రాన్సిస్కో: అతడు చిన్న వయస్సులోనే అమెరికాలోని సిక్కులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఓ పుస్తకం రాశాడు. 'బుల్లియింగ్ ఆఫ్ సిఖ్ అమెరికన్ చిల్డ్రన్: థ్రూ ద ఐస్ ఆఫ్ ఏ సిఖ్ అమెరికన్ హై స్కూల్ స్టూడెంట్' పేరిట 18 ఏళ్లకే పుస్తకాన్ని రచించాడు. ఈ పుస్తకంపై ఉపన్యాసించేందుకు, సిక్కు పిల్లల్లో స్ఫూర్తి రగిలించేందుకు అతిథిగా అతన్ని ఓ యూత్ సమావేశాలకు ఆహ్వానించారు. కానీ ఈ సమావేశాలకు వెళుతుండగానే అమెరికాలో సిక్కుల పట్ల ఎలాంటి వివక్ష ఉంటుందో అతనికి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. సిక్కు-అమెరికన్ అయిన కరణ్‌వీర్ సింగ్ పన్ను తలపాగాను కాలిఫోర్నియా విమానాశ్రయ సిబ్బంది బలవంతంగా అతనితోనే తీయించారు.
న్యూజెర్సీకి చెందిన కరణ్‌వీర్ సింగ్ కాలిఫోర్నియాలోని బేకర్స్ ఫీల్డ్‌లో జరుగనున్న సిక్కు యూత్ సమావేశాలకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. 'కాలిఫోర్నియా ఎయిర్‌పోర్టులో మెటల్ డిటెక్టర్ నుంచి వెళ్లిన తర్వాత నా తలపాగా తొలగించామని సిబ్బంది అడిగారు. అనంతరం పేలుడు పదార్థాలు ఉన్నాయా? అని స్వాబ్ పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలినా మరోసారి తనిఖీలకు తీసుకెళ్లారు. అక్కడ నా చేత తలపాగాను పూర్తిగా తీయించి.. మరోసారి తలపాగాను స్కాన్ చేశారు. తలపాగా తీయడానికి నేను మొదట నిరాకరించాను. కానీ తలపాగా తీయకుంటే నిన్ను విమానం ఎక్కనివ్వబోమని బెదరించారు. దాంతో నేను అంగీకరించాను. ఆ తర్వాత తలపాగా చుట్టుకోవడానికి సిబ్బంది ఓ అద్దం నాకు ఇచ్చారు' అని కరణ్‌వీర్ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించాడు. నీ తలపాగాలో ఏమైనా ఉందా? అని సిబ్బంది తనను అడిగారని, అయితే, నా తలపాగా కింద పొడవైన వెంట్రుకలు, దానికింద మెదడు ఉన్నాయని మర్యాదపూర్వకంగా వారికి సమాధానమిచ్చినట్టు అతను చెప్పాడు. సిక్కు యువకుడికి జరిగిన అవమానంపై స్పందించడానికి అమెరికా ట్రాన్స్ పోర్టెషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్‌ఏ) నిరాకరించింది. ప్రయాణికులందరి పట్ల హుందాగా నడుచుకోవాలని సిబ్బందికి తాము ఆదేశాలు ఇచ్చినట్టు చెప్తోంది.