స్మార్ట్ ఫోన్‌లా.. ఇదొక స్మార్ట్ సైకిల్
ఇది విద్యుత్తుతో నడిచే సైకిల్. ఇలాంటివి గతంలోనూ ఎన్నో చూశాం కదా... దీని ప్రత్యేకత ఏమిటి? ఒక ప్రత్యేకత కాదు, చాలానే ఉన్నాయి. ముందుగా దీన్ని తయారు చేసిన కంపెనీ గురించి. అమెరికాలోని ప్యూర్ సైకిల్స్ సంస్థ దాదాపు ఏడేళ్ల శ్రమ ఫలితంగా రూపుదిద్దుకుంది ఈ సైకిల్. పేరు వోల్టా. గంటకు 20 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. బ్యాటరీలు ఒకసారి ఛార్జ్ చేస్తే 64 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లిపోవచ్చు. చూసేందుకు మామూలు సైకిల్ మాదిరిగానే కనిపిస్తుంది గానీ.. సీటు అడుగున ఉన్న గొట్టంలో బ్యాటరీ, వెనుక టైర్ మధ్యలో విద్యుత్తు మోటర్‌లను అమర్చేశారు. విద్యుత్తుతో నడుస్తుంది గానీ.. అందుకోసం ప్రత్యేకంగా యాక్సలరేటర్ ఏదీ లేదు. అవసరమైనప్పుడు మోటర్ ద్వారా శక్తిని ఇచ్చేందుకు దీంట్లో పెడల్ అసిస్ట్ అనే టెక్నాలజీని వాడారు. పెడల్‌ను మనం ఎంత గట్టిగా నొక్కితే అంతమేరకు బ్యాటరీ నుంచి విద్యుత్తు ప్రవహిస్తుందన్నమాట.
అంతేకాదు.. మనం వేసే బ్రేక్‌ల ద్వారా వృథా అయ్యే శక్తిని కూడా విద్యుత్తుగా మార్చేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయి. ఇంటి నుంచి ఆఫీసుకు, ఇతర చోట్లకు వెళ్లేందుకు మాత్రమే కాకుండా... వ్యాయామం కోసమూ దీన్ని ఎంచుకోవచ్చు. ఎందుకంటే దీంతోపాటే వచ్చే స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా సైక్లింగ్ ప్రయోజనాలు అప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇక.. ముందు వైపున్న చిన్న బాక్స్‌ను చూశారా? అందులో 15 కిలోల బరువు వేసినా సైకిల్ పనితీరుపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. దీంట్లోని బ్యాటరీని 750 సార్ల వరకూ రీఛార్జ్ చేయవచ్చు. అతితక్కువ బరువు, ఒకే సైజు, విడిభాగాలు తక్కువగా ఉండటం వంటి కారణాల వల్ల తమ సైకిల్ ద్వారా అధిక మైలేజీ లభిస్తోందని, అన్నీ సవ్యంగా సాగితే మరో ఆరు నెలల్లో ఇది మార్కెట్‌లో ఉంటుందని అంటోంది ప్యూర్ సైకిల్స్ కంపెనీ.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్