ఓ మోడల్ పశ్చాత్తాపం... | social media celebrity essena o nile restarts her life | Sakshi
Sakshi News home page

ఓ మోడల్ పశ్చాత్తాపం...

Published Wed, Nov 4 2015 12:21 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

ఓ మోడల్ పశ్చాత్తాపం... - Sakshi

ఓ మోడల్ పశ్చాత్తాపం...

సిడ్నీ: ‘అందం చూడవయా...ఆనందించవయా’ అంటూ సోషల్ మీడియాలో వందలకొద్ది ఫొటోలను పోస్టు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో 5,74,000 మంది, యూట్యూబ్‌లో రెండున్నర లక్షల మంది అభిమానులను, 60 వేల స్నాప్‌చాట్ కాంట్రాక్టులను సాధించి ‘సోషల్ మీడియా సెలబ్రిటీ’గా ప్రశంసలు అందుకుంటున్న ఆస్ట్రేలియా లోని క్వీన్స్లాండ్కు చెందిన ఎస్సెనా ఓ నైల్‌కు హఠాత్తుగా జ్ఞానోదయమైంది.
 
16 ఏళ్ల వయస్సు నుంచి 18 ఏళ్లు నిండేవరకు సోషల్ మీడియాలో అంచెలంచెలుగా తన ఇమేజ్‌ని ఎలా పెంచుకుంటూ వచ్చిందీ, ఎలా అభిమానుల మనసుల్లో కల్లోలం రేపిందీ పూసగుచ్చినట్టు చెబుతూ వచ్చిందీ బుధవారం 19వ ఏట అడుగుపెట్టిన నైల్. దానికి సంబంధించిన రెండు వీడియోలను కూడా సోషల్ మీడియాకు విడుదల చేసింది. ‘మీరు చూసేది అసలైన అందం కాదు. అందం పట్ల మీలో నెలకొన్న భావన కూడా తప్పు’ అని తన అభిమానులనుద్దేశించి వ్యాఖ్యానించింది.

‘అందమైన కేర్ ఫ్రీ అమ్మాయిగా మీ హృదయాలను నేను కదిలించింది అంతా ఓ చిత్త భ్రమ. మీరు భావిస్తున్నట్టు నేను అందమైనదాన్ని కాను. కాకపోతే కాస్త నాజూకైన శరీరం నాది. ధరించిన దుస్తులు, దట్టమైన మేకప్, నేనాశించే, మీకు నచ్చే ఫొటో వచ్చేవరకు ఫొటోలు దిగడం, వాటిలో నుంచి ఎంపిక చేసిన ఫొటోలనే పోస్ట్ చేయడం హాబీగా చేస్తూ వచ్చాను. మీకు తెలియకుండానే నేను సోషల్ వెబ్‌సైట్లలో ఓ మాడల్‌గా మారిపోయాను. నేను ధరించే దుస్తులను ప్రమోట్ చేయడం కోసం డబ్బులు తీసుకునేదాన్ని. ఒక్కో డ్రెస్‌కు మూడువేల నుంచి మొదలైన నా వ్యాపారం లక్షాయాభై వేల రూపాయల వరకు చేరుకుంది. ఇప్పుడు ఈ మోడలింగ్ నాకు అసంపూర్తిగా, శూన్యంగా అనిపిస్తోంది’.

‘ఈ వాస్తవాన్ని గ్రహించకుండానే నా టీనేజ్‌లో మెజారిటీ సమయాన్ని సోషల్ మీడియాకే వెచ్చించాను. సోషల్ అప్రూవల్ కోసం, సోషల్ స్టేటస్ కోసం, నా భౌతిక దేహం అందంగా కనిపించడం కోసం ప్రాకులాడాను. గంటలకొద్ది నా అభిమానులకు వారికి నచ్చే సమాధానాలిస్తూ గడిపాను. ఇదంతా ఓ పద్ధతి ప్రకారం రూపొందించిన రూపకం. నాకు నేను ఇచ్చుకున్న జడ్జిమెంట్. నేను సంపాదించుకునేందుకు సోషల్ మీడియా నాకిచ్చిన అవకాశం. ఫొటో అందంగా రానప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయకుండా తిరస్కరించిన సందర్భాలు అనేకం. ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్‌గా కనిపించేందుకు టైట్ దుస్తులు ధరించిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు నాకైనాకు ఒంటరిదాన్ని అనిపించేది’.
 
‘నా సహజ అందాన్ని దాచేసిన కృత్రిమ అందాలనే మీరు ఇంతకాలం చూస్తూ వచ్చారు. నాకు నేను అందంగా కనిపిస్తున్నానని అనుకున్నప్పుడు నవ్వేదాన్ని. కృత్రిమ అందాల ప్రదర్శనకే నాకు డబ్బులిచ్చేవారు. ఇస్తారుకనుకనే బీచ్ ఒడ్డున బికినీల్లో ఫోజులిచ్చాను. ప్రస్తుత ప్రమాణాల ప్రకారం నేను సమాజానికి కూడా మంచిగాను, అందంగాను కనిపించాను. నాకున్నది వైట్ జెనటిక్స్ మాత్రమే. చివరకు నేను అందంగా కనిపించే బొమ్మలా మారిపోయాను. నాలా ఇతర అమ్మాయిలు ఈ మాయలో పడిపోకూడదన్నదే నా తాపత్రయం’ అంటూ వీడియోల్లో నైల్ వివరించడమే కాకుండా ఇన్‌స్టాగ్రామ్ నుంచి తన రెండువేల ఫొటోలను తొలగించారు. అకౌంట్స్‌ను క్లోజ్ చేస్నున్నట్టు చెప్పారు. ఎలాంటి మేకప్ వేసుకోకుండా వీడియోలలో సహజంగా కనిపించారు. ‘లెట్స్ బీ గేమ్ ఛేంజర్స్’ అనే కొత్త ప్రాజెక్టును తాను చేపడుతున్నట్టు ఆమె ప్రకటించారు. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ లేకుండా బతకాలని ఇతరులను ప్రోత్సహించడమే ఆ ప్రాజెక్ట్ లక్ష్యం.

సోషల్ మీడియా ప్రభావానికి లోనుకాకుండా, బాహ్య సౌందార్యాన్ని పక్కనపెట్టి అంతర్ సౌందర్యం ద్వారా ఓ వ్యక్తి శక్తిని గుర్తించే ఉద్యమానికి బాటలు వేయాలని కోరుకుంటున్నానని, మనుషులు ఎలాంటి సంకెళ్లు లేకుండా స్వేచ్ఛగా పెరగాలని, ఎదగాలని, తమ లక్ష్య సాధనలో దీక్షతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని నైల్ సెలవిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement