గర్భిణి ప్రసవానికి సైనికుల సహకారం..
రోమ్ః సెంట్రల్ రోమ్ స్క్యేర్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సైనికులు ఓ గర్భిణి ప్రసవానికి సహకరించి ప్రాణాపాయంనుంచీ కాపాడారు. ప్రసవంకోసం దగ్గరలో ఉన్న ఆస్పత్రికి నడుచుకుంటూ వెడదామని ప్రయత్నించిన మహిళకు ఉన్నట్లుండి నొప్పులు ఎక్కువవ్వతో దిక్కు తోచని ఆమె.. అరుపులు ప్రారంభించింది. దీంతో అక్కడికి దగ్గరలోనే విధులు నిర్వహిస్తున్న సైనికులు ఆమెకు తక్షణ సహాయం అందించారు. అత్యవసర పరిస్థితుల్లో బిడ్డకు జన్మనిచ్చేందుకు సహకరించి, తల్లీ బిడ్డల ప్రాణాలను నిలబెట్టారు.
పియాజ్జాశాన్ బార్టోలోమియో లో కాపలాగా ఉన్న ఇద్దరు సైనికులకు రాత్రి పదిగంటల సమయంలో మహిళ ఏడుపులు వినిపించడంతో అప్రమత్తమయ్యారు. ప్రసవంకోసం ఆస్పత్రికి నడుచుకుంటూ వెడుతున్న మహిళకు నొప్పులు తీవ్రం కావడంతో ఆమె ప్రసవానికి తాత్కాలిక ఏర్పాట్లు చేసి ఆదుకున్నారు. అత్యవసర సేవల్లో భాగంగా ప్రసవం అనంతరం బొడ్డు తాడు కత్తిరించిన సైనికులు.. తల్లీ బిడ్డలను సమయానికి ఆస్పత్రికి తరలించి సేవాభావాన్ని చాటుకున్నారు. అయితే తమకింకా పిల్లలు పుట్టలేదని, ప్రసవం గురించి పెద్దగా తెలియదని చెప్పిన సోల్జర్.. కార్పోరల్ ఫ్రాన్సిస్కో మన్కా.. ఎలాగైనా బాధితురాలిని రక్షించాలన్నదే తమ ధ్యేయమని, అందుకే అత్యవసర చికిత్సా విభాగం చేరేలోపు తోచిన సహాయం అందించామని చెప్పారు.
రోమ్ నుంచి దగ్గరలోని మోంటెరోటోండ్ నగరానికి ఆస్పత్రికి వెళ్ళేందుకు బయల్దేరిన 33 ఏళ్ళ కాంగో మహిళకు.. టైబరిన్ ఐస్ ల్యాండ్ లోని ఫ్రాటెల్లీ ఆస్పత్రికి చేరేలోపే నొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో బిడ్డకు జన్మనిచ్చేందుకు తక్షణ సహకారం అందించిన సైనికులు.. అనంతరం తల్లీ బిడ్డలను రోమ్ లోని ప్రఖ్యాత ప్రసూతి ఆస్పత్రి ఫాట్ బెనె ఫ్రాటెల్లీ కి తరలించారు. మరో ఇద్దరు పిల్లలను చూసుకుంటూ భర్త ఇంట్లోనే ఉండగా ఆమె ప్రసవంకోసం ఆస్పత్రిలో చేరేందుకు బయల్దేరినట్లు తెలుస్తోంది.