భయంతో కార్లలోనే..
ఒజు(జపాన్): జపాన్ భూకంపం అక్కడి ప్రజలను దుర్భర పరిస్థితిల్లోకి నెట్టింది. నేపాల్ లో సంభవించిన భూకంపం అక్కడి ప్రజల కంటిపై కునుకు లేకుండా ఎలా చేసిందో ప్రస్తుతం జపాన్ వాసుల పరిస్థితి కూడా అలాగే తయారైంది. ముఖ్యంగా ఓజు అనే ప్రాంతంలో ఉన్న ప్రజలను మాత్రం భయం ఏమాత్రం వీడటం లేదు. దీంతో అక్కడి వారంతా తమ నివాసాలను వదిలేసి విశాల మైదానాల్లో ఉన్న పార్కుల్లో తమ కార్లను పెట్టుకొని అందులోనే నిద్రస్తున్నారు.
నివాసాలను గురించిన ప్రశ్న అడిగితే వణికిపోతున్నారు. భూకంపం ప్రభావంతో ఇప్పటికీ కొండచరియలు విరిగిపడుతుండటమే ఆ భయానికి కారణంగా మారింది. జపాన్లో నిన్న ఉదయం 7.3 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు 6.5 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
దీంతో తొలి భూకంప ప్రకంపనలకే భయటకు వచ్చిన ప్రజలు మరో భూకంపం వచ్చేసరికి ఇక ఇళ్లకు ఏమాత్రం వెళ్లబోమంటూ చెప్తున్నారు. పార్క్లలో వంట చేసుకుంటాన్నారంటే ఈ భూకంపం వారిపై ఎంత ప్రభావాన్ని చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ సంభవించిన భూకంపం కారణంగా 41మందికి పైగా ప్రాణాలు కోల్పోగా 1,500 మందికి పైగా గాయాలపాలయ్యారు. వందల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.