
మాస్కో : కొందరు ఎంత ఉన్నత కుటుంబం నుంచి వచ్చినా తమకంటూ గుర్తింపు కోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తుంటారు. తండ్రి ఆస్తి నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా తను సొంతంగా సంపాదించిన దానితోనే సుఖంగా ఉంటానంటున్నాడు రష్యాకు చెందిన అలెగ్జాండర్ ఫ్రిడ్‌మాన్. బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం అలెగ్జాండర్ తండ్రి మికేల్ ఫ్రిడ్‌మాన్ రాష్యాలో అత్యంత ధనవంతుల జాబితాలో ఒకరిగా ఉన్నారు. మికేల్ ఫ్రిడ్‌మాన్ ఆస్తి విలువ సుమారు 13.7 బిలియన్ డాలర్లు ఉంటుంది. కానీ ఇవేవి వద్దనుకున్న అలెగ్జాండర్ తండ్రికి దూరంగా మాస్కో ప్రాంతంలో 500 డాలర్లకు ఒక రెండు గదుల ప్లాట్‌లో నివాసముంటున్నాడు.
ఇదే విషయమై అలెగ్జాండర్‌ను బ్లూమ్‌బర్గ్ సంప్రదించగా 'నేను సంపాదించిన దాంట్లోనే తింటాను, తిరుగుతాను, బతుకుతాను తప్ప వేరే వారిపై ఆధారపడను. నా తండ్రి సంపాదించిన ఆస్తి నాకు అక్కర్లేదు' అని పేర్కొన్నాడు. అలెగ్జాండర్ గతేడాదే లండన్ నుంచి ఉన్నత విద్యను పూర్తి చేసుకొని వచ్చాడు. తిరిగి రాగానే తండ్రిపై ఆధారపడకూడదని ఇళ్లు వదిలిపెట్టి మాస్కో పట్టణం అవతల ఒక రెండు రూంల ప్లాట్‌లోకి దిగాడు. ఎస్‌ఎఫ్ డెవలప్‌మెంట్ పేరుతో సొంతంగా ఒక వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాదిలోనే 450 మిలియన్ డాలర్లతో కంపెనీని మంచి లాబాలబాట పట్టించాడు. దీంతో పాటు మాస్కోలో ఉన్న రెస్టారెంట్లకు హుక్కా మెటీరియల్‌ను అందించే వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టాడు. ప్రస్తుతం అలెగ్జాండర్ తన తండ్రి నుంచి సహాయం పొందకుండానే వ్యవస్థలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment