చిన్న తప్పుతో విద్యార్థిని ఖాతాలో కోట్లు
చిన్న తప్పుతో స్టూడెంట్ అకౌంట్‌లో కోట్లు
Published Thu, Aug 31 2017 9:12 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM
సాక్షి, జోహెన్స్‌బర్గ్: సాంకేతిక తప్పిదాలు ఘోరాలకు దారితీయటమే కాదు.. అప్పుడప్పుడు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంటాయి. దక్షిణాఫ్రికాలో ఓ యూనివర్సిటీ అధికారులు చేసిన చిన్న తప్పు ఓ యువతికి మధురానుభూతిని మిగిల్చింది.
తూర్పు కేప్ ప్రాంతంలో ఉన్న ‘వాల్టర్ సిసులు యూనివర్సిటీ’లో ఓ యువతి చదువుతోంది. నెల నెలా భోజన ఖర్చుల నిమిత్తం విశ్వవిద్యాలయ అధికారులు ఆమెకు 1400 రాండ్(మన కరెన్సీలో 6800 రూపాయలు) స్కాలర్ షిప్ రూపంలో అందజేస్తున్నారు. అయితే జూన్ నెలలో మాత్రం పొరపాటున 1400కు బదులు 14 మిలియన్ రాండ్( మన కరెన్సీలో సుమారు 7 కోట్లు) ఆమె అకౌంట్‌లో జమ చేశారు. మరి అంత డబ్బు కనిపించేసరికి యువతి ఊరుకుంటుందా?
ఎడాపెడా షాపింగ్‌లు, పార్టీలతో జల్సా చేసింది. ఓ ఖరైదీన మొబైల్ ఫోన్‌తోపాటు బట్టలు కూడా కొనుగోలు చేసింది. మొత్తం సొమ్ములో సుమారు 80,000 రాండ్(39 లక్షలు) ఖర్చు చేసేసింది. ఆలస్యంగా తాము చేసిన తప్పును గమనించిన యూనివర్సిటీ అధికారులు యువతి అకౌంట్ నుంచి మిగతా డబ్బును వెనక్కి తీసేసుకున్నారు. నిబంధనల ప్రకారం ఖర్చు చేసిన ఖర్చు చేసిన సొమ్మును విద్యార్థిని చెల్లించాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
కాగా, సౌతాఫ్రికాలో గత రెండేళ్లుగా యూనివర్సిటీలో ఉచిత విద్య కోసం విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లను శాంతపరిచేందుకు ఆర్థిక సహాయ నిధిని ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ల రూపంలో ప్రభుత్వం అందజేస్తూ వస్తోంది.
Advertisement
Advertisement