యుద్ధం దిశగా చైనా...
బీజింగ్: దక్షిణ చైనా సముద్రం విషయంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్లో తమకు వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో యుద్ధాల్లో విజయాలు సాధించేలా తమ దేశ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)ని బలోపేతం చేసేందుకు చైనా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే హైటెక్ యుద్ధ పరికరాలు కలిగిన చైనా.. 23 లక్షల మందితో ప్రపంచంలోనే అతిపెద్దదైన తన ఆర్మీలో అధ్యక్షుడు జిన్‌పింగ్ సంస్కరణలు చేపడుతున్నారు. ఆదివారం పీఎల్‌ఏ 89 ఏట అడుగుపెడుతున్న తరుణంలో తమ ఆర్మీ సిబ్బందికి విజయం సాధించే దిశగా కఠినతరమైన శిక్షణ ఇవ్వడానికి నిర్ణయించారు.
విప్లవాత్మకమైన, సమగ్రమైన మార్పులు చేయడానికి సంస్కరణలు తప్పనిసరి అని, వాటికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిందేనని ఈ సందర్భంగా జిన్‌పింగ్ చెప్పారు. అంతర్జాతీయంగా తమ ఖ్యాతికి తగ్గట్లు ఆర్మీని తయారు చేయడానికి సంస్కరణలు తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. 2013లో అధికారం చేపట్టినప్పటినుంచి పీఎల్‌ఏపై దృష్టి పెట్టిన జిన్‌పింగ్.. దానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తున్నారు. ఏటా 9.6లక్షల కోట్లు అమెరికా డాలర్లు కేటాయిస్తూ.. ఆర్మీకి పెద్ద మొత్తం ఖర్చు చేస్తున్న దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో నిలిచారు. అంతేగాక తన నేతృత్వంలో పనిచేసే కేంద్రీయ మిలిటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసి ఆర్మీపై నియంత్రణను తన చేతుల్లోకి తీసుకున్నారు. 40 మంది అత్యున్నత స్థాయి కమాండర్లతో పాటు ఇద్దరు రిటైర్డు మిలిటరీ చీఫ్‌లపై విచారణకు ఆదేశాలిచ్చారు. ఏ క్షణంలోనైనా, ఎలాంటి యుద్ధాన్ని అయినా ఎదుర్కొనేలా తమ ఆర్మీకి తర్ఫీదునిస్తున్నారు.