సోషల్‌ మీడియాలో సెటైర్లు  | Stairs On Trump And Kim In Social Media | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో సెటైర్లు 

Published Tue, Jun 12 2018 11:56 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

Stairs On Trump And Kim In Social Media - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ భేటీని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా చూశాయి. ప్రధాన మీడియా ఈ సమావేశాన్ని ఒక చరిత్రాత్మక ఘటనగా చూస్తూ లోతైన విశ్లేషణలు చేస్తూ ఉంటే,  దీనికి భిన్నంగా సోషల్‌ మీడియాలో జోకులు, సెటైర్లతో నిండిపోయింది. ట్రంప్, కిమ్‌ల విభిన్నమైన మనస్తత్వాలు, వారిద్దరి మానసిక ప్రవర్తనపై రకరకాల ప్రచారాలు ఉండడంతో అంతటి శిఖరాగ్ర సమావేశం కాస్త సామాజిక మాధ్యమాల్లో అతి పెద్ద జోక్‌లా మారిపోయింది. వారిద్దరూ కరచాలనం చేసుకున్న దృశ్యాలను వీక్షించిన నెటిజన్లు కామెడీ పండించారు. ఈ ఇద్దరు నేతలకు మామూలుగా నిల్చోవడం వచ్చిందే అంటూ సెటైర్లు విసిరారు. ట్రంప్, కిమ్‌ కలిసి సింగపూర్‌ గార్డెన్‌లో నడిచిన ఫోటోలను వారిద్దరూ  రొమాన్స్‌ చేస్తున్నట్టుగా మార్ఫింగ్‌  చేసి ఈ బంధం దృఢమైనది అంటూ కామెంట్లు రాశారు.

ఒకరి హెయిర్‌ స్టయిల్, మరొకరికి వేస్తే  ఎలా ఉంటారో చూడండి అంటూ ఫోటోషాప్‌ చేసిన ఫోటోలు విస్తృతంగా షేర్‌ చేశారు. ఎన్నో టీవీ షోలు చూసినా రానంత థ్రిల్‌ వీరిద్దరూ ఒక చోట కలిసినప్పుడు వచ్చింది, చాలా భావోద్వేగానికి లోనయ్యాం అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. కిమ్‌పై ట్రంప్‌ ప్రశంసలు కురిపించడంతో లిటిల్‌ రాకెట్‌ మ్యాన్‌ కాస్త కొన్ని గంటల్లోనే అత్యంత సమర్థుడిగా ఎలా మారిపోయాడు అంటూ కొందరు ప్రశ్నించారు. మరి కొందరు వాళ్లిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను పెట్టి ఇదసలు నిజంగానే జరిగిందా ? నమ్మలేకపోతున్నాం  అంటూ వ్యాఖ్యానించారు. మరికొందరు ఇక ట్రంప్‌కి నోబెల్‌ శాంతి బహుమతి రావడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. ఇక ఇద్దరూ కలిసి సంయుక్త ప్రకటనపై చేసిన సంతకాలనూ నెటిజన్లు హేళన చేశారు. మానసిక రోగులు ఇద్దరూ కలిసి ఒక అబద్ధపు ప్రకటనపై సంతకాలు చేశారని, అంతే వేగంగా వాళ్లు దానిని మర్చిపోయి పరిస్థితిని మళ్లీ మొదటికి తెస్తారంటూ కొందరు అంచనా వేశారు. 

సింగపూర్‌ ఎక్కడ అంటూ సెర్చింగ్‌
ట్రంప్, కిమ్‌ శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్‌ ఎక్కడ ఉందా అన్న ఆసక్తి ఎక్కువగా అమెరికన్లలో కనిపించింది. ప్రపంచ పటంలో సింగపూర్‌ ఎక్కడ ఉందా అని అత్యధికులు సెర్చి చేసినట్టు గూగుల్‌ వెల్లడించింది. అంతేకాదు ట్రంప్‌ పొడవు ఎంత, కిమ్‌ అతని పక్కన నిల్చొంటే ఎలా ఉంటాడు, అతను ఎంత పొడుగు ఉన్నాడు వంటి విషయాలను కూడా ఎక్కువ మంది సెర్చ్‌ చేసి చూశారు. ఈ భేటీలో జరిగిన అణు చర్చలు, దాని పర్యవసనాల మీద కాకుండా కిమ్‌ హెయిర్‌ సై్టల్‌ , అతను వేసుకున్న బూట్లు, మావో సై్టల్‌ సూటు, కళ్లద్దాలు, వేష భాషల్ని చూస్తూ అతని స్వభావాన్ని అంచనా వేసిన నెటిజన్లు ఎక్కువ మంది కనిపించారు. 

పట్టించుకోని ఉత్తర కొరియా మీడియా 
ట్రంప్, కిమ్‌ కరచాలనాల దగ్గర్నుంచి వారి మెనూ వరకు ప్రపంచ మీడియా విస్తృతంగా కవర్‌ చేస్తే ఉత్తర కొరియా మీడియా మాత్రం అసలు పట్టించుకోలేదు. ఈ భేటీలో అసలేం జరుగుతోందో ప్రజలకు తెలీనివ్వక అంతా గుప్‌చుప్‌ అన్నట్టుగా వ్యవహరించింది. కొన్ని పత్రికలు మాత్రం కిమ్‌ సింగపూర్‌ పర్యాటక ప్రాంతాలను సందర్శించిన ఫోటోలను ప్రచురించాయే తప్ప, వీరిద్దరీ సమావేశంలో ఏం జరిగిందో వెల్లడించలేదు. ఆ దేశంలోని ప్రధాన న్యూస్‌ ఏజెన్సీ కేసీఎన్‌ఏ రష్యా నేషనల్‌ డే సందర్భంగా వ్లాదిమర్‌ పుతిన్‌కు కిమ్‌ జాంగ్‌ఉన్‌ శుభాకాంక్షలు చెప్పిన విషయాన్ని హైలైట్‌ చేసింది. గ్రీన్‌ హౌస్‌ వెజిటబుల్స్‌ ప్రాధాన్యత వంటి మూమూలు కథనాలే ఇచ్చింది తప్ప ఈ సమావేశం గురించి అంతగా పట్టించుకోలేదు. దీనిని బట్టి అక్కడ మీడియాపై ప్రభుత్వానికి ఎంత ఆధిపత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement