
వాషింగ్టన్/సింగపూర్: ఉత్తరకొరియాతో సంప్రదింపుల విషయంలో గత అమెరికా అధ్యక్షులు మోసపోయారని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించారు. భేటీ అనంతరం ఆయన సింగపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘కొరియా ద్వీపకల్పంలో సమగ్ర అణునిరాయుధీకరణను అమెరికా కోరుకుంటోంది.
ఈ విషయంలో గత అమెరికా అధ్యక్షులు మోసపోయారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు. ఎందరో అధ్యక్షులు గతంలో కాగితం ముక్కలపై సంతకాలు చేశారు. వారు ఆశించినవిధంగా ఉత్తరకొరియా వాగ్దానం చేయలేదు. ఇచ్చిన హామీలను కూడా తుంగలో తొక్కింది. కానీ, అధ్యక్షుడు ట్రంప్ మాత్రం..ఈ సమ్మిట్ నిర్ణయాలను అమలు చేయటానికి, ఫలితాలను ఎప్పటికప్పుడు అంచనా వేయటానికి పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు’అని అన్నారు.
రెండు దేశాలు పరస్పరం నమ్మకం కలిగి ఉండాలనీ, అంగీకరించిన అంశాలకు సంబంధించిన పత్రాలను కలిగి ఉండాలని నిర్ణయించామన్నారు. ఈ భేటీకి అవసరమైన ముందస్తు కసరత్తు కోసం మూడు నెలలుగా వివిధ ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన 100 మంది నిపుణులు కష్టపడ్డారని తెలిపారు.
కిమ్‌తో భేటీకి ముందు అధ్యక్షుడు ట్రంప్.. జపాన్ ప్రధాని షింజో అబే, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్–జే–ఇన్‌లతో వేర్వేరుగా ఫోన్‌లో సంప్రదించారని అధ్యక్షభవనం వెల్లడించింది. ఇటీవలి పరిణామాలను ట్రంప్ వారితో చర్చించారనీ, భవిష్యత్తులో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment