కిమ్ జోంగ్ ఉన్-ట్రంప్
కొరియా ద్వీపకల్పంలో శాశ్వతమైన, సుస్థిరమైన శాంతిని స్థాపించడానికి కలిసి పనిచేస్తామని వాగ్దానం చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌లు మంగళవారం సింగపూర్‌లో చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశాన్ని ముగించారు. ఈ సమావేశానికి కొనసాగింపుగా, దీని నిర్ణయాల అమలు కోసం సాధ్యమైనంత త్వరలో తదుపరి చర్చలు ప్రారంభిం చాలని కూడా వారు నిశ్చయించుకున్నారు. గతాన్ని పక్కనబెట్టి ముందుకు అడుగేయాలని ప్రతిన బూనారు. మూడునెలల క్రితం ఎవరి ఊహకూ అందని ఈ శిఖరాగ్ర చర్చలు ఎన్నో అవాంతరాలను అధిగమించి ఇలా సాకారం కావడం ప్రపంచ శాంతిని కాంక్షించేవారికి సంతృప్తినిస్తుందనడంలో సందేహం లేదు.
ఈ చర్చలు ఎప్పుడు జరుగుతాయా అని ప్రపంచమంతా ఎదురుచూస్తుండగా అమెరికా,ఉత్తర కొరియాల మధ్య మాటల యుద్ధం రాజుకోవడం... చివరకు వాటిని నిలిపేస్తున్నట్టు గత నెల చివరిలో ట్రంప్ ప్రకటించడం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. చివరకు ఉత్తర కొరియా సంయమనంతో స్పందించిన పర్యవసానంగా పరిస్థితి మళ్లీ కుదుటపడింది. ప్రపంచమంతా ఇలాంటి చర్చల కోసమే ఎన్నాళ్లనుంచో ఎదురు చూసింది. ఎందుకంటే ఉత్తర కొరియాది దేనికీ వెరవని తత్వం. 1950లో మొదలై మూడేళ్లపాటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య సాగిన యుద్ధంలో దాదాపు 12 లక్షలమంది మరణించారు. ఇందులో ఉత్తర కొరియాకు అండగా వచ్చిన అమెరికన్ సైనికులు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. 1953లో యుద్ధ విరమణ సంధి కుదిరినా దక్షిణ కొరియా దాన్ని ఖాతరు చేయలేదు. ఆ సంధిపై ఉత్తర కొరియాతోపాటు అమెరికా, చైనాలు మాత్రమే సంతకాలు చేశాయి. రెండు కొరియాల మధ్యా పరస్పర దాడులు ఆగినా ఉద్రిక్తతలు మాత్రం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి.
దక్షిణ కొరియాలో అమెరికా సైనిక స్థావరాలొ చ్చాయి. అణ్వాయుధాలు, క్షిపణులు చేరాయి. ఇప్పుడు ట్రంప్ చెప్పిన లెక్కల ప్రకారం ఆ దేశంలో ప్రస్తుతం 32,000మంది అమెరికా సైనికులు మోహరించి ఉన్నారు. వీటన్నిటికీ అమెరికా విధించిన ఆంక్షలు అదనం. ఇన్ని దశాబ్దాలుగా ఉత్తర కొరియా ప్రజలు వీటన్నిటినీ ఎలా తట్టుకున్నారన్నది పెద్ద పజిల్. తమది సోషలిస్టు ప్రభుత్వమని ఉత్తర కొరియా చెప్పుకున్నా అక్కడ మొదటినుంచీ ఎడతెగకుండా సాగుతున్న వంశపారంపర్య పాలన ఆ అభిప్రాయానికి బలాన్నివ్వదు. ఇక పాశ్చాత్య మీడియాలో కిమ్ గురించి తరచుగా వెలువడే కథనాలు ఆయన్నొక నియంతగా, మూర్ఖత్వం మూర్తీ భవించిన నేతగా చూపుతుంటాయి. అందువల్లే సింగపూర్‌లో కిమ్ ఎటు వెళ్లినా, ఎలాంటి హావ భావాలు ప్రదర్శించినా అవి అందరిలోనూ ఆసక్తిని రేపాయి. ]
గతాన్ని పక్కనబెట్టాలని అమెరికా, ఉత్తర కొరియాలు నిర్ణయించినా... ఇరు దేశాల అధినేతలూ నిజంగానే ఆ పని చేసినా అందరిలోనూ ఏదో ఒక మూల అనుమానాలుంటాయి. ఎందుకంటే ఆ గతం అలాంటిది. 1985లో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేసినా దానికి కొన సాగింపుగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ)తో రావలసిన ఒప్పందానికి ఉత్తర కొరియా ససేమిరా అంది. దక్షిణ కొరియా నుంచి అమెరికా సేనలు వైదొలగితే తప్ప దానిపై సంతకం చేయబోనని స్పష్టం చేసింది.
1994లో నాటి అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆ దేశంతో చర్చలు జరిపి ఒప్పందం కుదుర్చుకున్నారు. 2000లో అమెరికాలో సీనియర్ బుష్ హయాం మొదలు కావడంతో అది కాస్తా మూలనబడింది.ఆయన కుమారుడు బుష్ అధ్యక్షుడిగా ఉండగా మళ్లీ చర్చలు మొదలయ్యాయి. చైనా, జపాన్, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, రష్యా, అమెరికాలు ఇందులో పాల్గొన్నాయి. అవి ఒక కొలిక్కి వచ్చే దశలో తమ బ్యాంకు ఖాతాలను అమెరికా స్తంభిం పచేయడంతో ఆగ్రహించిన ఉత్తర కొరియా చర్చల నుంచి వైదొలగింది. ఏడాది తర్వాత అమెరికా దారికొచ్చి ఆ ఆంక్షలు తొలగించింది. తిరిగి 2009లోనూ, 2012లోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అందువల్లే సింగపూర్ చర్చలూ అదే తరహాలో ముగుస్తాయని అనుమానాలు రావడం సహజం.
శిఖరాగ్ర చర్చల పర్యవసానంగా ఇప్పటికి జరిగిన మేలు ఏమంటే ఆ ఇద్దరు దేశాధినేతలూ ఇకపై పరస్పరం బెదిరించుకోరు. తమ దేశ భద్రతకు గ్యారెంటీ ఇస్తే అణ్వాయుధాలను వదులు కోవడానికి సిద్ధమని కిమ్ ప్రకటించినా... మరిన్ని చర్చల తర్వాతగానీ ఈ విషయంలో స్పష్టత ఏర్పడదు. అటు ట్రంప్ కీలకమైన హామీలిచ్చారు. ఆంక్షలు ప్రస్తుతానికి కొనసాగుతాయని చెబు తూనే దక్షిణ కొరియాతో ఇకపై ఉమ్మడి సైనిక విన్యాసాలుండవని, అక్కడి తమ సైనిక స్థావరాలను మూసేస్తామని, 32,000మంది అమెరికా సైనికులనూ వెనక్కు రప్పిస్తానని ఆయన ప్రకటించారు. ట్రంప్ స్వభావం తెలిసినవారు తొలి అడుగులోనే ఉత్తర కొరియాకు ఇన్ని వరాలివ్వడంలోని ఆంతర్యమేమిటో బోధపడక సహజంగానే గందరగోళపడతారు. ఇన్నాళ్లూ ఉత్తర కొరియాకు సహకరించిన చైనా... అమెరికా మిత్రదేశం దక్షిణ కొరియా కూడా సహకరిస్తేనే ఈ చర్చలు సవ్యమైన దిశగా సాగుతాయి.
అయితే ఉత్తర కొరియా వద్ద అణ్వస్త్రాలు లేనట్టయితే ప్రపంచానికి ముప్పు తప్పుతుందని అమె రికా చేస్తున్న ప్రచారం వాస్తవాన్ని ప్రతిబింబించదు. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో 9 దేశాల వద్ద 16,000 అణ్వస్త్రాలున్నాయి. మరికొన్ని దేశాలు ఆ బాటన నడవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అణ్వస్త్రాలు చేజిక్కించుకోవాలని ఉగ్రవాద ముఠాలు కాచుక్కూర్చున్నాయి. ఇలాంటి విపత్కర పరి స్థితుల్లో అణ్వస్త్ర దేశాలన్నీ స్వచ్ఛందంగా వాటిని వదులుకుని సంపూర్ణ అణు నిరాయుధీకరణకు సహకరిస్తే తప్ప ఈ ప్రపంచం సురక్షితంగా ఉండదు. కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పడం ఆ దిశగా తొలి అడుగైతే బాగుండునని నిజమైన శాంతికాముకులు కోరుకుంటారు. అలాగాక నయానో భయానో మరో దేశం అమెరికాకు లొంగి ఉండటానికి సిద్ధపడిందనిపించుకోవాలని ట్రంప్ భావిస్తే దానివల్ల ఒరిగేదేమీ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment