విమానంలో నుంచి పడి మృతి
లండన్: విమానం గాలిలో ఎగురుతుండగా ఓ వ్యక్తి దాని నుంచి కింద పడి మరణించాడు. మరో వ్యక్తి ఆస్పత్రిపాలై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. విమానం నుంచి కింద పడటమేంటి? అనుకుంటున్నారా? వారు దొంగచాటుగా విమానం కింద దాక్కొని ప్రయాణించారు మరి! వివరాల్లోకెళితే.. బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ విమానం గురువారం ఉదయం దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ నుంచి లండన్‌కు బయలుదేరింది. మొత్తం 13 వేల కి.మీ. దూరం. 11:20 గంటల ప్రయాణం. విమానం లోపల అయితే సురక్షితం. కానీ విమానానికి కరుచుకుని దాని కింద ల్యాండింగ్ గేర్ వద్ద ఉండే స్థలంలో ప్రయాణం అంటే చావును కొనితెచ్చుకోవడమే.
ఒక్కోసారి విపరీతమైన వేడి. మరోసారి మైనస్ 50 డిగ్రీలకు పడిపోయే ఉష్ణోగ్రతలు. పది కి.మీ. ఎత్తుకు వెళితే ఆక్సిజన్ కూడా అందదు. అయినా.. ఇద్దరు వ్యక్తులు అక్కడ దాక్కుని దొంగచాటుగా ప్రయాణించారు. కానీ.. లండన్‌లోని హీత్రూ విమానాశ్రయానికి చేరుకోవడానికి ముందు విమానం రిచ్‌మండ్ మీదుగా ఎగురుతుండగా ఓ వ్యక్తి కిందపడ్డాడు. రిచ్‌మండ్‌లోని ఓ దుకాణం పైకప్పుపై పడి చనిపోయాడు. ల్యాండింగ్ గేర్ వద్దే కరుచుకుని ఉండిపోయిన 30 ఏళ్లలోపున్న మరో యువకుడిని ప్రాణాపాయ స్థితిలో విమానాశ్రయ సిబ్బంది గుర్తించారు. వీరు జోహెన్నెస్‌బర్గ్ నుంచే దొంగచాటుగా వచ్చారని, ఈ ఉదంతంపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.