
తలపై ప్రత్యేక పరికరంతో పిల్లలు
బీజింగ్ : కరోనా వైరస్ సృష్టించిన విలయం నుంచి చైనా మెల్లమెల్లగా కోలుకుంటోంది. కరోనా పుట్టిల్లు వూహాన్‌లో కూడా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా స్కూళ్లు తెరుచుకుంటున్నాయి. అయితే కరోనా వైరస్ నేర్పిన గుణపాఠంతో ప్రజలు ముందు జాగ్రత్తలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక దూరం పాటించే విషయంలో. అందుకే స్కూళ్లకు వచ్చే పిల్లలు ఒకరికొకరు దగ్గరకు రాకుండా ఉండేందుకు కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలని యాజమాన్యాలు నిబంధన విధిస్తున్నాయి. దీంతో హాంగ్‌ఝౌ సిటీలోని ఓ స్కూలులో పిల్లలు సామాజిక దూరం పాటించేలా ఉండేందుకు డీఐవై టోపీలను పెట్టుకుని తరగతులకు హాజరవుతున్నారు. మూడు అడుగుల పొడవుండే అట్టముక్కలు టోపీ రెండు చివర్ల అమరి ఉండటం వీటి ప్రత్యేకత. ( వారికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు )
పొడవాటి అట్టముక్కల కారణంగా పిల్లలు ఒకరికొకరు దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు. కొంతమంది అట్లముక్కలకు బదులుగా పొడవాటి బెలూన్లను కూడా ఉపయోగిస్తున్నారు. స్కూలు యాజమాన్యాలు కూడా ఇలాంటి హెడ్జర్లపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. సామాజిక దూరాన్ని పాటించడానికి పిల్లలు ఉపయోగిస్తున్న ఈ హెడ్జర్ల పద్దతికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment