భూమిపై నీరు.. సూర్యుడికన్నా పురాతనం!
భగీరథుడి తపస్సు ఫలించి...
గంగాదేవి దివి నుంచి భువికి దిగివస్తుండగా.. ఫొటో తీసినట్లు ఉంది కదూ ఈ చిత్రం! అయితే.. ఇది గంగా ప్రవాహమే అయినా.. కైలాస గంగ కాదు. నక్షత్రాలు, గ్రహాలను ఏర్పరిచే నక్షత్రధూళి మేఘాల నుంచి అంతరిక్షంలోని సౌరవ్యవస్థలకు నీరు చేరుతున్నట్లు రూపొందించిన ఊహాచిత్రం. ప్రస్తుతం భూమిపై సముద్రాల్లో ఉన్న నీరు సూర్యుడి కన్నా అతి పురాతనమైనదట. మంచు తోకచుక్కలు, ఉల్కల్లో ఉన్న నీటి అణువులను, సముద్రాల్లోని నీటి అణువులను పోల్చిచూడగా.. ఈ సంగతి వెల్లడైందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్ శాస్త్రవేత్త టిమ్ హ్యారిస్ వెల్లడించారు.
సూర్యుడి వయసు 460 కోట్ల ఏళ్లు, భూమి వయసు 454 కోట్ల ఏళ్లు అని అంచనా. అయితే సముద్రాల్లోని నీటిలో, తోకచుక్కల్లో ఉన్న భార హైడ్రోజన్ అణువులు సూర్యుడు, భూమి కన్నా ఎంతో పురాతనమైనవని, నక్షత్రధూళి మేఘాల నుంచి రోదసిలో తోకచుక్కల ద్వారా ప్రయాణిస్తూ.. కాలక్రమంలో అవి భూమిని చేరాయని హ్యారిస్ చెబుతున్నారు.